Google Pay: ఏ బ్యాంకు నుంచైనా ఏ లోన్ తీసుకోవాలనుకున్నా.. మొదట సంబంధిత వ్యక్తి ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయి? అనేది ప్రతీ బ్యాంకు పరిశీలిస్తోంది.. అందులో కీలక భూమిక పోషించేది సిబిల్ స్కోర్.. ఏ బ్యాంక్ అయినా దరఖాస్తుదారుడి ట్రాక్ రికార్డ్ కోసం సంబంధిత వివరాలతో సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంది. ఇక, కొన్ని వెబ్‌సైట్లు ఈ సేవల కోసం ఛార్జీలను కూడా వసూలు చేస్తుంటాయి.. ఇటీవల కాలంలో చాలా వెబ్‌సైట్లు, యాప్‌లు సిబిల్ స్కోర్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. అందులో ఒకటి చాలా మంది తరచుగా ఉపయోగించే యాప్ గూగుల్ పే. తన యూజర్లకు సిబిల్ సేవలను ఉచితంగా అందిస్తోంది గూగుల్ పే..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, సిబిల్ స్కోర్ అంటే ఏమిటి? అనే వివరాల్లోకి వెళ్తే సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అని అర్థం. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధీకృత క్రెడిట్ ఏజెన్సీ. సిబిల్ వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని సేకరించి.. సంబంధిత వ్యక్తులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించి.. నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్ రుణ చరిత్ర నివేదిక, సిబిల్ స్కోర్ ను తయారుచేస్తుంది. సాధారణంగా సిబిల్ స్కోర్ 300- 900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే మాత్రం దానిని బ్యాడ్ సిబిల్ స్కోర్‌గా పరిగణిస్తారు. అలాంటి వారికి రుణం ఇవ్వడానికి ఏ బ్యాంకు కూడా ముందుకు రాదు.. వారు దరఖాస్తు చేసుకున్నా.. సిబిల్‌ను పరిశీలించిన తర్వాత తిరస్కరిస్తారు.
మరోవైపు.. సిబిల్ 750 కంటే ఎక్కువగా ఉంటే మెరుగైన స్కోర్‌గా పరిగణిస్తారు. వీరికి నెలవారీ ఆదాయం పట్టి లోన్ మొత్తాన్ని ఆయా బ్యాంకులు నిర్ణయిస్తాయి.. మొత్తంగా సిబిల్ సేవలను ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది గూగుల్ పే.. కోట్లాది మంది వినియోగదారులను కలిగిఉన్న ఈ డిజిటల్ పేమెంట్ యాప్.. మొదట్లో దీంట్లో కేవలం నగదు బదిలీకి మాత్రమే అవకాశం కల్పించింది.. దశలవారీగా అనేక సేవలు అందుబాటులోకి తెచ్చింది.. అందులో బిల్లు చెల్లింపులు, రీఛార్జ్.. ఇలా అనేక సేవలు అందిస్తుండగా.. ఇప్పుడు సిబిల్ స్కోర్‌ను కూడా ఉచితంగా అందిస్తూ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది..