Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది.. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది.. ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ రైలు మార్గంలో భారీ వర్షాలకు ప్రమాదకరంగా మారాయి కొండచరియలు.. కొత్తవలస కిరండోల్ రైలు మార్గంలో కొండచరియలు విరిగిడ్డంతో పట్టాలు తప్పింది గూడ్స్ రైలు ఇంజన్.. శివలింగపురం యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.. దీంతో, కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.. అరకులోనే కిరండోల్ – విశాఖ ప్యాసింజర్ రైలును అధికారులు నిలిపివేశారు.. ప్రయాణికులను ఆర్టీసీ బస్సులలో గమ్యస్థానాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు..
ఇక, తుఫాన్ కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతుంది భారీ ఈదురు గాలులతో వర్షం కురవడం వలన పంటల్లోకి నీళ్లు చేరాయి వరి మొక్కలు చాలా చోట్ల నేలకొరిగాయి కోత కోసి పానాలపై పెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది మిల్లులకు తరలించడానికి సిద్ధం చేసిన ధాన్యాన్ని రోడ్లపై పోసి ప్లాస్టిక్ బరకాలు కప్పి రైతులు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు గోదారి డెల్టాలో 80 శాతం మేరకు పంటలు కోతలు పూర్తయి మిల్లులకు తరలించడం జరిగింది. ఆర్ బికెల ద్వారా రైతులు. డబ్బులు పొందారు. మిగిలిన 20 శాతం పంటలు తుఫానుకు గురికావడంతో నష్టాన్ని చవి చూడవలసి వస్తుందని రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.
ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సుమారు పది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.. జిల్లాలో ప్రధానంగా ఖరీఫ్, రబీ సీజన్లో సరాసరి సాగు కన్నా దాదాపు 70 శాతం తక్కువగా సాగు చేశారు.. దీని వల్ల డ్యామేజ్ చాలా తగ్గింది.. పొలాల్లోని నీరు బయటకు వెళ్తే కానీ ఎంత మేర నష్టం వాటిల్లుతుందో అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు.. జిల్లాలో భారీ వర్షాలకు పొగాకు, వరి, శెనగ పంట నీట మునిగింది.. జిల్లాలోని కొండేపి, దర్శి, సంతనూతలపాడు, బాపట్ల జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో పంట నష్టం జరిగింది.. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న జిల్లాలో ఇప్పుడు వర్షాలు పడటం పాడి రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు..
కాకినాడ జిల్లాలో తుఫాను ప్రభావంతో మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్న 31 వేల టన్నుల ధాన్యం తడిసింది.. 1500 ఎకరాల్లో వరి పొలాలు నేలకొరిగాయి.. తాళ్లరేవు, తొండంగి, జగ్గంపేట, తుని, యుకొత్తపల్లి, గొల్లప్రోలు ఏలేశ్వరం మండలాలలో తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోయారు.. జగ్గంపేట మండలంలో పామాయిల్ తోటలకు నష్టం చేకూరింది..