YSRCP Gajuwaka: ఏపీలో అధికార పార్టీలో వరుస రాజీనామాలు జరుగుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన కొద్ది సేపట్లోనే గాజువాక వైసీపీ ఇంఛార్జ్ తిప్పల దేవన్‌రెడ్డి కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే రోజు ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడడం చర్చనీయాంశంగా మారింది. గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించి వైసీపీ తరపున ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బలంగా నిలిచారు. ఈసారి ఆ స్థానాన్ని తన కుమారుడు దేవన్ రెడ్డికి ఇవ్వాలని ఆయన కోరుతుండడం గమనార్హం. గాజువాకలో నాగిరెడ్డి కుమారుడు దేవన్‌రెడ్డి పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. ఈ సమయంలో దేవన్ రెడ్డి ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా పార్టీ మారనున్నారనే ప్రచారం జరుగుతోంది.
Read Also: AP High Court: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపు పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
దేవన్‌రెడ్డి రాజీనామా అనంతరం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి జిల్లా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు, ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న తిప్పల దేవన్‌రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అమర్‌నాథ్‌ను నియమించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాజువాక ఇంఛార్జ్ బాధ్యతలు గుడివాడ అమర్‌నాథ్ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా.. పార్టీ పరిశీలనలో ఉన్నా తనకు ఎటువంటి సమాచారం లేదని మంత్రి పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. రాజీనామాలు చేసిన వారిని వైసీపీ అధిష్ఠానం పట్టించుకోవడం లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయగానే పార్టీ నేతలు గంజి చిరంజీవిని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఆయనకే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఇచ్చే అవకాశం ఉంది.