YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా కదిరి వచ్చిన సీఎం జగన్.. పార్టీ కండువా కప్పి చాంద్ బాషాను పార్టీలోకి ఆహ్వానించారు. కదిరి టికెట్ ఆశించిన అత్తార్ చాంద్ బాషా.. టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన చాంద్ బాషా తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. కదిరి మాజీ ఎమ్మెల్యే అయిన అత్తార్ చాంద్ బాషా.. ఈసారి ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం మాత్రం చాంద్ బాషాకు మొండి చేయి చూపింది. మరో అభ్యర్థి వెంకటప్రసాద్ టికెట్ కేటాయించడంతో.. అసంతృప్తితో ఉన్న చాంద్ బాషా టీడీపీకి రాజీనామా చేశారు.
Read Also: Perni Nani: ప్రజల తిరుగుబాటుతో మాట మార్చారు.. పెన్షన్ల పంపిణీని ఎవరూ ఆపలేరు..
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కదిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్తార్ చాంద్ బాషా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ మారిన చాంద్ బాషా.. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికల్లోనూ చాంద్ బాషా టీడీపీ టికెట్ ఆశించగా.. చంద్రబాబు మాత్రం కందికుంట వెంకటప్రసాద్‌కు కేటాయించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున సిద్ధారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో అయినా చంద్రబాబు తనకు అవకాశం ఇస్తారనుకుంటే.. అధినేత మాత్రం మరోసారి అనుకుంటే కందికుంట వైపే మొగ్గుచూపటంతో చాంద్ బాషా టీడీపీకి రాజీనామా చేశారు. కదిరి నియోజకవర్గంలో మైనారిటీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. దాంతో ఇక్కడ వైసీపీ మైనారిటీ అభ్యర్థిని బరిలో నిలుపుతోంది. ఈ నేపథ్యంలో మైనారిటీ అయిన తనకు టీడీపీ టికెట్ కేటాయిస్తుందని చాంద్ బాషా భావించగా.. నిరాశే మిగిలింది.
Read Also: Volunteers Resign: మచిలీపట్నంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
మంత్రి పదవితో పాటు తగిన గుర్తింపును ఇస్తామని చంద్రబాబు మాట తప్పాడని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ఆదివారం పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి పట్టణంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు గాని, బహిరంగ సభకు కానీ కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. తనకు అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎప్పటికీ కృతజ్ఞుడినే అని ఆయన వ్యాఖ్యానించారు.