Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చి మాట్లాడే నేర్పరి అని, దిగజారి మాట్లాడతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పెన్షర్ల పొట్ట కొట్టారని చంద్రబాబు సిగ్గులేకుండా అంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాలంటరీలు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. వాలంటరీలు వద్దు అని ఈసీకి లెటర్ ఇచ్చింది టీడీపీ సానుభూతిపరులు కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. దగ్గుబాటి పురంధేశ్వరి, నిమ్మగడ్డ రమేష్ ఎవరో ప్రజలకు తెలియదా అని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ హోదాలో ఉండి నిమ్మగడ్డ రమేష్ చేసిన వేషాలు ప్రజలు చూడలేదా అంటూ ప్రశ్నించారు. మళ్ళీ మాకు ఏమి సంబంధం లేదని బుకాయిస్తున్నారని విమర్శించారు.
Read Also: Pawan Kalyan: నన్ను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ సంచలనం
ఈ రెండు నెలలు వాలంటీర్లు లేకపోతే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు పింఛన్లు ఇచ్చారని జనం అనుకుంటారా అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. వాలంటీర్లు వద్దని ఢిల్లీ నుంచి మండలందాకా తన మనుషులను చంద్రబాబు తిప్పారన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో చంద్ర బాబు మాట మార్చారని.. పెన్షన్ల పంపిణీ ఆపడం ఎవరి వల్ల కాదన్నారు. పేదల ఉసురు పోసుకుని చంద్రబాబు బాగుపడతరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటరీ వ్యవస్థ నడుం విరగ్గొడతామని ఏలూరులో పవన్ అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. మహిళ అదృశ్యానికి వాలంటీర్లు కారణం అని కూడా పవన్ అన్నారని పేర్ని నాని చెప్పారు. మళ్లీ ఇప్పుడు వాలంటీర్ల పొట్ట కొట్టాలని తాను అనుకోవడం లేదని పవన్ కల్యాణే అంటున్నారని పేర్కొన్నారు.
Read Also: AP Pensions: పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. రాత్రికల్లా మార్గదర్శకాలు
చంద్ర బాబుకు వాలంటీర్లు అంటే భయమని పేర్నినాని అన్నారు. చంద్రబాబు బీజేపీతో దోస్తీ, కుస్తీ చేస్తూ వస్తున్నారన్నారు. గతంలో మోడీ గెలిస్తే ముస్లింలకు ప్రమాదం అన్న చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ సిగ్గు లేకుండా మోడీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. చంద్ర బాబువి దిక్కుమాలిన రాజకీయాలని ఎద్దేవా చేశారు. జన్మ భూమి కమిటీల మీద మాది ఒకటే వైఖరి…అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేశామన్నారు. చంద్రబాబు మాటల ఎర వేసి వేటడతాడని.. అవసరం తీరిన తర్వాత ఎంత వారిని అయిన పాతర వేస్తాడని ఆరోపించారు. త్వరలో పవన్ కళ్యాణ్‌కి కూడా తెలుస్తుందన్నారు. తాను పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుని ఉంటానన్న పవన్.. కానీ జలుబు చేస్తే మాత్రం హైదరాబాద్ వెళతారన్నారు. పిఠాపురంలో జలుబు డాక్టర్ లేరా అంటూ ప్రశ్నించారు. జనసేన జెండా మోసిన వారిలో ఎంత మందికి పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చారని పేర్నినాని ప్రశ్నించారు. జనసేన తీసుకున్న 21 సీట్లలో అంతా తెలుగు దేశం వాళ్ళకి ఇవ్వడం ఏంటని అడిగారు. ఇంటింటికి బియ్యం ఇవ్వవద్దని టీడీపీ ఎన్నికల సంఘానికి పిటిషన్ ఇచ్చిందని ఆయన తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అడ్డుకునే ప్రయత్నం ఈ విషపు కూటమి చేస్తుందన్నారు. మళ్లీ సీఎం జగన్ రెండోసారి సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయమన్నారు.