Harish Rao: పెండింగ్ బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం సర్పంచులు గొంతెత్తితే పాపం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు. ఏడాది కాలంగా మాజీ సర్పంచులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం దుర్మార్గమన్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు హైదరాబాద్‌కు వచ్చి మొర పెట్టుకున్నారని.. నిరసనలు తెలిపితే నిర్బంధిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Group-2 Hall Tickets: గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల
అప్పులు చేసి, భార్య పిల్లల మీద బంగారం అమ్మి పనులు చేశామని, పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని మాజీ సర్పంచులు వేడుకుంటే ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఎంతో కృషి చేశారన్నారు. ఉత్తమ గ్రామాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందంటే, ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించిందంటే అందులో సర్పంచుల పాత్ర కీలకమన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన మాజీ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వారి పట్ల ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నలు గుప్పించారు.
బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు.. కానీ పేద సర్పంచులు పనులు చేసిన పాపానికి శిక్ష వేస్తున్నారన్నారు. ఇదేం న్యాయం.. ఇంకెన్నాళ్ళు వాళ్లు ఇలా రోడ్డెక్కి పోరాటం చేయాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి లేదా పంచాయతీ శాఖ మంత్రి మాజీ సర్పంచులను చర్చలకు పిలవాలని, వారి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.