వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ఎంజాయ్ చేసిన చిన్నారులు నేడు అంగన్వాడీ కేంద్రాల బాట పట్టారు. మొదటి రోజు కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లు కలిసి చిన్నారులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (డాక్టర్ ధనసరి అనసూయ) ఆదేశాల మేరకు మొదటి రోజు లంచ్‌లో ఎగ్ బిర్యానీని అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు వడ్డించింది. ఎగ్ బిర్యానీని చిన్నారులు ఎంజాయ్ చేశారు. తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ పెట్టారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు ఒకే రకమైన భోజనం కాకుండా మెనూలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. సాధ్యమైన చోట, వీలున్నప్పుడల్లా చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో మొదటి రోజు ఎగ్ బిర్యానీని చిన్నారులకు పెట్టారు. అంగన్వాడీలో చిన్నారుల అడ్మిషన్లను, అటెండెన్స్‌ను పెంచడానికి పిల్లల టేస్టుకు అనుగుణంగా ఆహారం వడ్డించాలని నిర్ణయం తీసుకున్నారు. మంచి ఫుడ్ పెట్టడం ద్వారా చిన్నారులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆట వస్తువులతో పాటు నాణ్యమైన విద్య బోధన, ఆటలు, పోషకాహారం, ఎగ్ బిర్యానీ వంటి వెరైటీ ఫుడ్ సర్వ్ చేయటం ద్వారా చిన్నారులు, తల్లిదండ్రుల్లో అంగన్వాడీల పట్ల నమ్మకం పెరుగుతోందన్న భావనలో ప్రభుత్వం ఉంది.
Also Read: CM Revanth Reddy: నా దగ్గర ఉన్న శాఖలే కొత్త మంత్రులకు ఇస్తా.. ఒక్కడినే నిర్ణయం తీసుకోలేను కదా?
తొలిరోజు పదుల సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న ఆహారం, సేవల పట్ల రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. అంగన్వాడీల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వయంగా పరిశీలించిన కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ స్థాయిలో పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.