Gujarat Elections: గుజరాత్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన తొలిదశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియగా.. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగియనుంది. తొలిదశలో 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం దక్షిణ గుజరాత్‌లోని 19 జిల్లాలు, కచ్ సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 788 మంది అభ్యర్థుల్లో 718 మంది పురుషులు.. 70 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఆప్ 88 స్థానాల్లో పోటీకి దిగింది. బీఎస్పీ 57, బీటీపీ 14, ఎస్పీ 12, వామపక్షాలు 6 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. 339 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.
PFI: పీఎఫ్ఐపై నిషేధాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు.
మొదటి దశలో భాజపా తొమ్మిది, కాంగ్రెస్ ఆరు, ఆప్ ఐదుగురు మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. తొలి విడత జరిగే స్థానాల్లో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1.24 కోట్ల మంది పురుషులు.. 1.15 కోట్ల మంది మహిళలు.. 497 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.మొదటి దశ ఎన్నికల్లో 25,434 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో 9,018, గ్రామీణ ప్రాంతాల్లో 16,416 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మొత్తం 2,20,288 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని సీఈసీ వెల్లడించింది.గుజరాత్ శాసనసభలో మొత్తం 182 స్థానాలు ఉండగా.. మొదటిసారి త్రిముఖ పోటీ జరగనుంది. బీఎస్పీ, బీటీపీ, ఎస్పీ, వామపక్షాలు తదితర పార్టీలు బరిలో నిలిచినప్పటికీ పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్య నెలకొననున్నట్లు తెలుస్తోంది. తొలిదశలో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. దేవభూమి ద్వారక జిల్లాలోని ఖంభాలియా నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి ఇసుదాన్ గాధ్వీ పోటీ చేస్తున్నారు. గుజరాత్ మాజీ మంత్రి పరుషోత్తం సోలంకీ.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కున్వర్జీ బవలియా.. కాంతిలాల్ అమృతియా.. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా.. ఆప్ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కూడా బరిలో ఉన్నారు.