సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లపై పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. అల్లర్లపై ఫాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ కోసం రైల్వేస్టేషన్‌కు సభ్యులు చేరుకుని వివరాలను సేకరించారు. అల్లర్లకు గల కారణాలు, పోలీసుల కాల్పులపై నివేదికను సిద్ధం చేయనున్నారు.
సికింద్రాబాద్ అల్లర్లపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ వెల్లడించారు. అభ్యర్థులు, పోలీసుల కాల్పుల అంశంలో ఫాక్ట్ ఫైండింగ్ నివేదిక సిద్ధం చేయనున్నామన్నారు. కాల్పులు జరిపే అవసరం ఉంటే, మోకాళ్ల భాగంలో ఫైరింగ్ చేయాల్సి ఉండేదన్నారు. రబ్బర్ బులెట్, రియల్ బులెట్ అనే చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు. ఘటనపై దర్యాప్తు అధికారులు పూర్తి సమాచారం ప్రజల ముందు ఉంచాలన్నారు. ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులపై కాల్పులు జరపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ అల్లర్లపై మానవహక్కుల కమిషన్‌ను , న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరతామన్నారు.
అసలేం జరిగిందంటే..: సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్’పై ఆర్మీ అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆర్మీర్యాలీల్లో అర్హత సాధించి.. వైద్యపరీక్షలు కూడా పూర్తిచేసుకుని పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ కొత్త పథకాన్ని ప్రకటించడంతో మండిపడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారం దాదాపు రెండు వేల మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పలు రైళ్లను ధ్వంసం చేశారు. ఇంజిన్లు, బోగీలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు జరిపిన కాల్పుల్లో.. వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు రాకేష్ మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అల్లర్లకు కారణమైన వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Agnipath Protests: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం