కూటమి ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, ఇంతవరకూ ఆ ఊసే లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సమున్నత ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం నీరుగారుస్తోందని, బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఏడాది తల్లికి వందనంను ఎగ్గొట్టారని, వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో విద్యారంగం ఎంతో పటిష్టంగా తయారైందని మాజీ మంత్రి కాకాణి చెప్పుకొచ్చారు. నెల్లూరులో వైసీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ కార్యక్రమం జరిగింది. వీఆర్ కళాశాల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ కొనసాగింది.
‘యువత పోరు’ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ‘సమున్నత ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం నీరుగారుస్తోంది. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూడా ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది. నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు, ఇంతవరకూ ఆ ఊసే లేదు. ఈ ఏడాది తల్లికి వందనాన్ని ఎగ్గొట్టారు, వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెబుతున్నారు. బడ్జెట్లో రూ.8 వేల కోట్లను మాత్రమే కేటాయించారు. ఈ పథకానికి రూ.16వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. విద్యా రంగాన్ని సీఎం చంద్రబాబు దెబ్బ తీస్తున్నారు. వైసీపీ హయాంలో విద్యారంగం ఎంతో పటిష్టంగా తయారైంది. నాడు-నేడుతో పాఠశాలలకు కొత్త రూపును మాజీ సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చారు’ అని అన్నారు.
మరోవైపు కర్నూలు కలెక్టరేట్ ముందు వైసీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు ఆందోళన చేపట్టారు. గౌరీ గోపాల్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని.. నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఫీజు పోరు కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, సాయి ప్రసాద్ రెడ్డి, కోడుమూరు సమన్వయకర్త ఆదిమూలపు సతీష్ తదితరులు పాల్గొన్నారు.