పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు రానున్నారు. ఈ సందర్భంగా ఆమె జ్యోతిర్లింగము శక్తిపీఠము కొలువైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో.. తెలంగాణ , ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన లింగాల గట్టు, ఏపీ సరిహద్దు ప్రాంతం శిఖరం వద్ద సోమవారం ఉదయం 11 గంటలకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తామని ఎస్పీ రఘువీర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రపతి శ్రీశైలం చేరుకున్న తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి లింగాలగట్టు, శిఖరం వద్ద రాకపోకలకు అనుమతి ఇస్తామని ఆయన వెల్లడించారు. శ్రీశైలం వచ్చే భక్తులు ట్రాఫిక్ ఆంక్షలకు ముందుగానే వచ్చేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు పోలీసులు.
Also Read : Crime News: బుడ్డోడు కాదు.. హత్యలు, దోపిడీల్లో పెద్దోడు
శ్రీశైలం చేరుకున్న భక్తుల వాహనాలు రింగురోడ్డు చుట్టూ ఉన్న పార్కింగ్ సముదాయంలోనే పార్కు చేయవలసి ఉంటుందని ఆయన వెల్లడించారు. మరోసారి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాహనాల రాకపోకలను నిలిపివేసి.. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి వెళ్ళిన వెంటనే సున్నిపెంట, శిఖరం వద్ద వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తామని పోలీసులు వెల్లడించారు. ఎవరైనా శ్రీశైలానికి చేరుకునే భక్తులు సోమవారం ఉదయం 10 గంటల లోపు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీ రఘువీర్ రెడ్డి సూచనలు చేశారు. అలాగే శ్రీశైలం నుంచి బయలుదేరేవారు కూడా ఉదయం 9 గంటల లోపు బయలుదేరి వెళ్లిపోయే విధంగా చూసుకోవాలని పోలీసులు వెల్లడించారు.