Deputy CM Pawan Kalyan: గతంలో ఒక్కస్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశాం.. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములం అయ్యాం.. కీలక శాఖలు తీసుకున్నాం.. బాధ్యత పెరిగిందన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులను సత్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన పోటీ చేసిన ప్రతి సీటును గెలిచింది. ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే.. అందరూ ఇదే విషయాన్ని అడిగారు. జనసేన 100 శాతం స్ట్రయిక్ రేట్ అనేది దేశంలో ఓ కేస్ స్టడీ అయ్యిందన్నారు. జనసేన విజయం గొప్ప విజయం. జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే వేరే వాళ్లు తట్టుకోలేకపోయేవారు. ఓటమి తర్వాత మాజీ సీఎం సభలో ఉండలేక వెళ్లిపోయారు. ఒక్క స్థానం లేకున్నా.. పట్టుదలతో పని చేశామని గుర్తుచేసుకున్నారు. 175లో 21 పెద్ద సంఖ్య కాకపోవచ్చు.. కానీ, 164 రావడానికి జవసేన వెన్నెముకగా మారిందన్నారు.. గతంలో రోడ్డు మీదకు రావాలంటే భయపడే పరిస్థితి. వైసీపీ నేతలు పచ్చి బూతులు తిట్టేవారు. గతంలో సాక్షాత్తూ ఓ ఎంపీనే సీఐడీ కార్యాలయంలో కొట్టారు. అడ్డగోలు దోపిడీ గత ప్రభుత్వం హయాంలో జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరికీ ధైర్యం ఇచ్చాం అన్నారు.
Read Also: Zomato CEO: బిలియనీర్ గా మారిన జొమాటో సీఈవో దీపిందర్ గోయల్..
జనసేన పోటీ చేయని చోట్ల కూడా జనసేన మిత్రపక్ష అభ్యర్థులకు అండగా నిలిచారని ప్రశంసలు కురిపించారు పవన్.. జనసేన రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే పని చేశారు. పొట్టి శ్రీరాములు, డొక్కా సీతమ్మ ప్రేరణతో పని చేస్తున్నాం. పదవులతో సంబంధం లేకుండా ప్రజల కోసం పని చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం. కీలక శాఖలు తీసుకున్నాం. సరైన సమయంలో అందరికీ బాధ్యతలు అప్పగిస్తానని ప్రకటించారు.. 140 కోట్ల ప్రజల భారాన్ని మోసే ప్రధానికి సాయంగా నిలవాలి. పోటీ చేయని నేతలూ పార్టీ కోసం పని చేశారు. ఎంత సాధించినా ఒదిగి ఉండడం మంచిదని సూచించారు. ఎన్ని స్ఖానాలు మనకున్నాయని కాదు.. ఎంత బలంగా చేశామనేది ముఖ్యం. తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత జరిగిన సభలో జోష్ తగ్గిందని.. కానీ, ఫలితాలు అద్భుతంగా వచ్చాయి. 7 శాతం నుంచి 20 శాతం ఓటింగ్ పెరిగిందని వెల్లడించారు జనసేనాని..
Read Also: Donald Trump: నేను చనిపోయాను అనుకున్నాను..
ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సందర్భంలో కూడా ఈ స్థాయిలో గెలుపు.. మెజార్టీలు రాలేదని అన్నారు పవన్.. అయితే, వైసీపీ నేతలు మనకు శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే. కక్ష సాధింపులు వద్దు.. వ్యక్తిగత దూషణలు వద్దు. అలాగని మనమేం వెనక్కు తగ్గినట్టు కాదు అన్నారు.. యుద్ధం అనివార్యమే అయితే సిద్దమే. వైసీపీ చేసిన తప్పులు మనం చేయొద్దు అని సూచించారు. ప్రజల కోసం పదవులు పక్కన పెట్టి పని చేయడానికి సిద్ధమన్న ఆయన.. వివిధ శాఖల రివ్యూలు చేస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఏ శాఖలోనూ డబ్బుల్లేవు. ప్రజాధనంతో రిషికొండ ప్యాలెస్ కట్టారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. కానీ, ఫర్నిచర్ కోసం.. ఆడంబరాల కోసం పెద్దగా ఖర్చేం పెట్టొద్దని చెప్పాను. ప్రతి రోజూ ఒక్క ప్రజా ప్రతినిధి అయినా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. అధికారంలోకి వచ్చామని దుర్వినియోగం చేయొద్దు. రౌడీయిజాన్ని నమ్మొద్దు. దురుసుగా మాట్లాడ్డం.. బెదిరింపు ధోరణితో వెళ్లడం కరెక్ట్ కాదు.. ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే.. వారిని నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. మహిళా నేతలను ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో విమర్శించినా సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. సంస్కరించాల్సిన మనమే.. తప్పులు చేయకూడదని సూచించారు.
Read Also: Devi sri prasad : గచ్చిబౌలిలో రచ్చలేపనున్న దేవిశ్రీ..
ఇక, ఎప్పుడూ ఓటేయని వాళ్లు వచ్చి మరీ ఓటేశారు. మన మీద ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారు. కానీ, నేను లేకపోతే పార్టీ ఏదో అయిపోతుందని.. రాజకీయం ఉండదని నేను అనుకోవడం లేదు అన్నారు పవన్ కల్యాణ్.. జనసేన లేకుంటే ఏపీ రాజకీయాలు ఉండవనే భ్రమలోనూ లేనన్న ఆయన.. జనసేన నేతలు.. కార్యకర్తలు కూడా నా తరహాలోనే ఆలోచించాలని కోరుకుంటున్నాను అన్నారు. విర్రవీగినందుకు వైసీపీ లాంటి పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. జనం కోసం నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. దెబ్బతినడానికి సిద్దంగా ఉన్నాను కానీ.. ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో రాజీ పడను అని స్పష్టం చేశారు. తమ బిడ్డలే తమ రాజకీయ వారసులనే విధంగా వ్యవహరించ వద్దు. బిడ్డల కోసం ఏదైనా చేయొచ్చు కానీ.. రాజకీయ వారసులు కూడా వాళ్లేననే దిశగా ఆలోచన చేయొద్దు అని సూచించారు. టీడీపీ, బీజేపీ నేతలను కించపరచొద్దు. ఎవరైనా కామెంట్లు చేసినా దాన్ని వ్యక్తిగతంగానే చూడాలి.. పార్టీలకు ఆపాదించొద్దన్నారు.. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం. నాతో సహా ప్రతి ఒక్కరూ చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉండాలని అని పిలుపునిచ్చారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..