ప్రస్తుతం ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయని, తమ సంక్షేమ కార్యక్రమాలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు పైబడి గెలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అజెండానే పాలనగా చేస్తున్నాం అని, సంపద అంతా వెనుకబడిన వర్గాల వారికి అందేలా చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అనిపేర్కొన్నారు. 1931లో కులగణన చేశారని, తెలంగాణ కాంగ్రెస్ మాత్రమే మరలా ఇప్పుడు చేసిందన్నారు. లక్ష కోట్లు మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చి కోటీశ్వరులను చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని డిప్యూటీ సీఎం చెప్పారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
‘ఎప్పుడో మొదలు పెట్టిన ఈ భవన నిర్మాణం మా అందరి చేత భూమి పూజ చేపించిన అందరికీ ధన్యవాదాలు. ఏ భవనం నిర్మాణం జరిగినా, ఏ పని మొదలు పెట్టినా భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి వచ్చిన వారికి హైదరాబాదులో నిర్మించిన హాస్టల్ అనేక మందిని చైతన్య వంతులను చేసింది. చైతన్యవంతం కలిగిన ఖమ్మం జిల్లా అదేవిధంగా ఆలోచించి గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. సర్వాయి పాపన్న గౌడ్ వరంగల్‌కు కొద్ది దూరంలో ఓ గ్రామంలో జన్మించాడు. గోల్కొండ కోటను కూడా ఆయన అధిష్టించాడు. ఆయన సాధించిన విజయాలు కొద్ది ఏళ్లకు మరుగున పడిపోయిన బ్రిటిష్ వారు ఆయన గురించి తెలుసుకున్నారు. ఆయన ఎంతో మందికి స్పూర్తి దాయకమని భావించి ఆయన విగ్రహాన్ని ఖమ్మం నగర బొడ్డులో నిర్మించుకుంటున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం, ప్రజా అభీష్టం మేరకు పాలన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ’ అని డిప్యూటీ సీఎం అన్నారు.
‘రాష్ట్ర జనాభాలో ఉన్న ప్రజానికాన్ని కులగణన చేసి అత్యంత వెనుకబడిన వర్గాలకు ఫలాలు అందించేలా చేయాలి. చిన్న పొరబాటు జరగకుండా కులగణన సర్వేని పూర్తి చేశాం. పొరబాట్లు, తప్పులు జరిగితే పట్టుకుందామని కొందరు అనుకున్నారు కానీ.. వాళ్లకు మనం ఆ అవకాశం ఇవ్వలేదు. రోజుకి 8 నుండి 10 సర్వే చేయించి, అంతకుమించి సర్వే చేయనివ్వకుండా చేశాం. బలహీన వర్గాలు 56 శాతం ఉన్నారని గుర్తించి చట్టబద్ధత కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చేసిన సర్వేని కేంద్రానికి పంపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ ప్రధాని కూడా దేశంలో కులగణన చేస్తామని చేసేలా చేశారు రాహుల్ గాంధీ. ఈ భవన నిర్మాణం కేవలం సంవత్సర కాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్తున్నారు. ఆయన చెప్పినట్లుగా తప్పనిసరిగా సాధ్యమైనంత మేరకు భవన నిర్మాణమే కాకుండా కోచింగ్ సెంటర్తో పాటు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం కూడా నిర్మిస్తాం’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.
Also Read: Mahesh Kumar Goud: ఖమ్మం జిల్లా కారణంగానే.. రేవంత్ రెడ్డి సీఎం, భట్టి డిప్యూటీ సీఎం అయ్యారు!
‘ప్రజల అజెండానే పాలనగా చేస్తున్నాం. సంపద అంతా వెనుకబడిన వర్గాల వారికి అందేలా చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేసింది. 50 రోజుల్లో పూర్తి చేసి ఒక్క చిన్న పొరపాటు లేకుండా చేశాం. 1931లో కులగణన చేశారు. తెలంగాణ కాంగ్రెస్ మాత్రమే మళ్లీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ చేసినది దేశంలోనే ఓ రికార్డు. శాస్త్రీయపరమైన సర్వే చేశాం. చట్ట బద్దమైనది కూడా. 56 శాతం బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ప్రతిపాదన పెట్టాం, కేంద్రానికి పంపించాం. రాహుల్ గాంధీ చెప్పినప్పుడు నవ్వారు. కానీ రాహుల్ గాంధీ ఏమి చెప్పారో అదే ఇప్పుడు బీజేపీ కూడా చేయబోతుంది. సమసమాజ నిర్మాణం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. మా సంక్షేమ కార్యక్రమాలతో వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు పైబడి గెలుస్తాం. ఏ రాష్ట్రంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు. 90 లక్షల కుటుంబాలకు తెల్ల కార్డులు వున్నాయి. మరో పది లక్షల కార్డులు ఇస్తున్నాం. కోటి కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్నాం. 13,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పదవుల పంపిణీ జరుగుతుంది, సామాన్యులకు పదవుల పంపిణీ వుంటుంది’ అని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.