భగవంతుడు ఏదో కులంలో మన పుట్టుకకు అవకాశం ఇచ్చాడని, తాను గౌడ కులంలో జన్మించానని, అందుకు ఎంతో గర్విస్తున్నాను అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మనం పుట్టిన కులాన్ని గౌరవించాలి కానీ.. ఇతర కులాలను తక్కువ చేయకూడదన్నారు. కుల వ్యవస్థ, కుల వృత్తులు లేనిదే దేశం లేదు అని.. కుల వృత్తులు అంతరించిపోకుండా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. గౌడ వృత్తిని గొప్ప వృత్తిగా చెప్పుకోవాలని, ప్రతిరోజు గౌడ్‌లు తాటి చెట్టు ఎక్కి దిగడం అంత ఆషామాషీ కాదు అని పేర్కొన్నారు. వెనుకబడ్డ తరగతుల వారికి సమన్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు పాల్గొన్నారు.
‘మన పుట్టుకను భగవంతుడు ఏదో కులంలో అవకాశం ఇచ్చాడు. నేను గౌడ కులంలో జన్మించాను, అందుకు గర్విస్తున్నాను. మనం పుట్టిన కులాన్ని గౌరవించాలి కానీ.. ఇతర కులాలను తక్కువ చేయకూడదు. హైదరాబాద్‌లో కొన్ని ఫంక్షన్ హాల్స్, అందులో అయ్యే ఖర్చులు చూస్తే.. పేదవాడి జీవితం మొత్తం నడుస్తుందని అనిపిస్తుంది. హిమాయత్ నగర్ గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మించారు. నిజాంబాద్‌లో రెండున్నర ఎకరాల్లో కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అందరికీ సముచిత స్థానం ఇస్తుంది. కుల వ్యవస్థ లేనిదే దేశం లేదు, కుల వృత్తులు లేనిదే కూడా దేశం లేదు. అందుకే కుల వృత్తులు అంతరించిపోకుండా ప్రభుత్వాలు పని చేయాలి. గౌడ వృత్తి గొప్ప వృత్తిగా చెప్పుకోవాలి. ప్రతిరోజు గౌడ్‌లు తాటి చెట్టు ఎక్కి దిగడం అంత ఆషామాషీ కాదు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రేవంత్ రెడ్డి సీఎం, భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు అంటే.. కారణం ఖమ్మం జిల్లానే’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Also Read: Ponnam Prabhakar: గౌడ్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుంది.. 40 లక్షల తాటి మొక్కలు సిద్ధం!
‘రాహుల్ గాంధీ ఆదేశాలతో రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దళిత బిడ్డ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కులగణన చేశారు. రిజర్వేషన్ తీసుకుని వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్దామని చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అగ్రవర్ణాలు బ్రతికినట్లుగా కింది వర్గాలు కూడా బ్రతికేలా చూసేది కాంగ్రెస్ పార్టీ. సమాజంలో ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా పేద వారికి ఫలాలు అందాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీది. గత ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. వెనుకబడ్డ తరగతుల వారికి సమన్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష. వచ్చే సంవత్సరం నాటికి కమ్యూనిటీ హాల్ పూర్తి చేసుకునే బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలదే. కులాలను, మతాలను ఇష్టపడితే తప్పులేదు.. ఇతర కులాలను, మతాలను కించపరచడం తప్పు’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ మనకి దేవాలయం వంటిది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖమ్మం జిల్లా ఎంతో తోడ్పాటు అందించింది. నైపుణ్యం, చైతన్యం ఖమ్మం జిల్లాలో ఉంది. అధికారంలోకి వచ్చి 18 మాసాలు గడించింది. లక్ష 78 వేల కోట్ల విదేశీ నిధుల తెచ్చాం. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. అప్పుల ఊబిలోకి నెట్టి బీఆర్ఎస్ పలాయనం బాట పట్టింది. ఈ నెలలో కార్పొరేషన్, డైరెక్టర్లను భర్తీ చేస్తాం. గుజరాత్ తరహాలో పార్టీ పదవుల ఎంపిక వుంటుంది. కార్యకర్తలను నమ్ముకున్న పార్టీ కాంగ్రెస్. క్రింది స్థాయి కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. మీ శ్రమ వల్లనే అధికారంలోకి వచ్చాం’ అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.