Deep Dasgupta Surprised Rohit Sharma and Virat Kohli back to India T20 Team: జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఆడిన ఈ ఇద్దరు 14 నెలల తర్వాత టీ20 జట్టులోకి వచ్చారు. కోహ్లీ, రోహిత్ జట్టులోకి రావడంతో జూన్ 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లోనూ వీళ్లిద్దరూ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. దిగ్గజాల రాకతో భారత జట్టు మరింత పటిష్టం అయిందని మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ సంతోషం వ్యక్తం చేశారు. అయితే టీమిండియా మాజీ బ్యాటర్ దీప్‌దాస్ గుప్తా మాత్రం భిన్నంగా స్పందించాడు. కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ అవసరమా? అని ప్రశ్నించాడు.
అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20లకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంపిక కావడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని దీప్‌దాస్ గుప్తా తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్‌తో దీప్‌దాస్ మాట్లాడుతూ… ‘టీ20 ఫార్మాట్‌లో జట్టు ముందుకు వెళ్లిందని అనుకున్నాను. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పునరాగమనంతో కాస్త ఆశ్చర్యపోయా. వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ ఆడిన విధానం చాలా బాగుంది. భారత సీనియర్ ఆటగాళ్లలో ప్రధాన విమర్శ ఏమిటంటే టీ20ల్లో సరైన ఉద్దేశం లేకపోవడం. పొట్టి టోర్నీ జరిగే వెస్టిండీస్‌లో 180-200 పిచ్‌లు లేదా 160ల పిచ్‌లు ఆశిస్తున్నామో అని మనం గుర్తుంచుకోవాలి’ అని అన్నాడు.
‘ఈ నిర్ణయాల వల్ల రింకూ సింగ్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ లాంటి యువకులకు జట్టులో చోటే కష్టమవుతుంది. కేవలం అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ గురించి కాకుండా.. పొట్టి టోర్నీని దృష్టిలో పెట్టుకుని సమాలోచనలు చేయాలి. ప్రస్తుతం రింకూ, యశస్వి పెద్ద మ్యాచ్‌లలో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ రోహిత్, కోహ్లీ, పాండ్యా, సూర్యలతో నిండిపోతే.. రింకూ, తిలక్ వర్మ లాంటి వాళ్ల పరిస్థితి ఏంటి?’ అని దీప్‌దాస్ గుప్తా ప్రశ్నించాడు. టీమిండియా తరఫున 8 టెస్టుల్లో 344, 5 వన్డేల్లో 51 పరుగులు దీప్‌దాస్ చేశాడు. జనవరి 11న మొహాలీలో ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ తొలి టీ20 ఆడనుంది.
Also Read: Realme 12 Series Launch: లేటెస్ట్ కెమెరాతో భారత మార్కెట్‌లోకి రియల్‌మీ 12 సిరీస్!
భారత టీ20 జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, సంజు శాంసన్ (కీపర్), రింకు సింగ్, జితేశ్ శర్మ (కీపర్), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్.