Cyber Crime Alert: రాష్ట్రంలోని సైబర్ క్రైమ్ యూనిట్.. ప్రజలను “డిజిటల్ అరెస్ట్” స్కామ్‌ల గురించి హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేసింది. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ స్కామ్‌లలో మోసగాళ్లు పోలీస్, సీబీఐ, కస్టమ్స్, ఈడీ, TRAI, DOT, NIA, ATS లేదా కరియర్ సిబ్బంది పాత్రను పోషించి, బాధితులు సీరియస్ క్రైమ్స్ లో ఉన్నారని చెప్పడం.. బాధితులను మనీ లాండరింగ్, ట్రాఫికింగ్, నార్కోటిక్స్ లేదా టెర్రరిజం వంటి తీవ్రమైన నేరాలలో ఇరికించి అరెస్ట్ చేస్తామని, బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అవుతాయని లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తారు. ప్రజలు వ్యక్తిగత లేదా బ్యాంక్ సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లను వెంటనే నివేదించాలని డీసీపీ కోరారు.
24 రోజుల బ్యాటరీ లైఫ్, 2.07 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో REDMI Watch 6 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
మోసగాళ్లు మొదట పోలీస్, సీబీఐ అని చెప్పి అరెస్ట్, ఖాతా ఫ్రీజ్ లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు భయపెడతారు. తమ మాటలకు నమ్మకం కలిగించడానికి, వారు నకిలీ FIRలు, నాన్-బైలబుల్ అరెస్ట్ వారెంట్లు లేదా RBI లెటర్‌లను కూడా బాధితులకు పంపుతారు. అంతేకాకుండా.. భారీ శిక్ష పడుతుందని లేదా కుటుంబ ప్రతిష్టకు హాని కలుగుతుందని బెదిరించి భయాన్ని పెంచుతారు. ఆ తర్వాత “సుప్రీం కోర్టుకు సమర్పించాలి” అని చెప్పి డబ్బును డిమాండ్ చేస్తారు. ఈ మోసగాళ్లు “నో ఇన్వాల్వ్‌మెంట్ సర్టిఫికేట్” పొందడం కోసం లేదా అరెస్ట్‌ను నివారించడానికి డబ్బును వేరే ఖాతాలకు తరలించమని చెబుతారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని ఒత్తిడి చేస్తారు.
ఈ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు కొన్ని భద్రతా సూచనలు (Safety Instructions) జారీ చేసింది. అవేంటంటే..
భయపడకండి: ‘డిజిటల్ అరెస్ట్’ అనేది నిజంగా లేదు. పోలీస్ లేదా ఇతర అధికారులు ఎప్పుడూ డిజిటల్ మాధ్యమాల ద్వారా అరెస్ట్ చేయరు.
నకిలీలకు జాగ్రత్త: కాలర్ ID స్పూఫింగ్, నకిలీ డాక్యుమెంట్లు, వాట్సాప్ వీడియో కాల్స్ అన్నీ మోసమే. నిజమైన అధికారులు ఎప్పుడూ డబ్బు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అడగరు.
సున్నితమైన సమాచారాన్ని పంచుకోవద్దు: OTPలు, ఆధార్, వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దు. అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే కట్ చేయండి.
సరిగా ధృవీకరించండి: స్థానిక పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ అధికారిక హెల్ప్‌లైన్‌లను నేరుగా సంప్రదించి, వచ్చిన కాల్స్ లేదా మెసేజ్‌ల వాస్తవాన్ని ధృవీకరించుకోవాలి. మోసగాళ్లు ఇచ్చిన నంబర్‌లు లేదా లింక్‌లను ఉపయోగించకూడదు.
సాక్ష్యాలు నిలుపుకోండి: కాల్ లాగ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు, ఇమెయిల్స్, స్క్రీన్‌షాట్‌లు, ట్రాన్సాక్షన్ ఐడీలు ఇంకా అనుమానాస్పద యాప్‌ల ఇన్స్టాలేషన్ చరిత్ర వంటి సాక్ష్యాలను భద్రపరచాలి.
వెంటనే నివేదించండి: అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫోన్ చేయండి. లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి. తాజా సైబర్ అవేర్‌నెస్ అప్‌డేట్‌ల కోసం సైబర్ క్రైమ్ యూనిట్ సోషల్ మీడియా ఖాతాలను (Facebook, Instagram, X) అనుసరించాలని కూడా పోలీసులు సూచించారు.