రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. పార్లమెంట్‌లో డా బీఆర్ అంబేద్కర్‌ను కేంద్రమంత్రి అమిత్ షా అవమానపరిచాడని, ఆయనను ప్రధాని మోడీ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. అమిత్ షాని మంత్రి పదవి నుండి తొలగించాలని డిసెంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం అని తెలిపారు. ఆదాని అగ్రిమెంట్‌పై అవకతవకలు జరిగాయని రాయటర్స్ పత్రిక రాసిందని, సీఎం చంద్రబాబు కూడా ఆదాని అంశంపై స్వందించడం లేదన్నారు. ఆదాని అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్వందించడం లేదు? అని రామకృష్ణ ప్రశ్నించారు.
విజయవాడ దాసరి భవన్‌లో సీపీఐ శత వార్షికోత్సవ వేడుకలకు సంబందించిన పోస్టర్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, ఇతర నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ… ‘డిసెంబర్ 26 నుండి శత వార్షికోత్సవాలు ప్రారంభం అవుతాయి. సీపీఐ శత వార్షికోత్సవ సభ ఖమ్మంలో 2026 డిసెంబర్ 26న జరుగుతుంది. దేశంలో కాంగ్రెస్, సీపీఐ మాత్రమే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీలు. సంవత్సరం పొడవునా శత వార్షికోత్సవ సభలు జరుగుతాయి. 26న విజయవాడలో శత వార్షికోత్సవ సభలు జరుగుతాయి’ అని చెప్పారు.
‘పార్లమెంట్‌లో డా బీఆర్ అంబేద్కర్‌ను కేంద్రమంత్రి అమిత్ షా అవమానపరిచారు. ప్రధాని అమిత్ షాని వెనకేసుకొస్తున్నారు. రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదు. రాజ్యాంగ పీఠిక మార్చాలని బీజేపీ ఎంపీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. అమిత్ షాని మంత్రి పదవి నుండి తొలగించాలని 30వ తేదీన దేశ వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఆదాని అగ్రిమెంట్‌పై అవకతవకలు జరిగాయని రాయటర్స్ పత్రిక రాసింది. సీఎం చంద్రబాబు కూడా ఆదాని అంశంపై స్వందించడం లేదు, ఆయన బయపడుతున్నారు. ఆదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. చిన్న చిన్న అంశాలపై స్పందిస్తున్న సీఎం ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదు. ఆదాని అంశంపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్వందించడం లేదు?. చంద్రబాబు నిద్రా పోతున్నారా? లేక నిద్ర పోయినట్లు నటిస్తున్నారా?. ఆదాని అంశంపై చర్యలు తీసుకొనే వరకు సీపీఐ పోరాటం చేస్తుంది’ అని రామకృష్ణ తెలిపారు.