Covid Booster Dose Distribution in telangana: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం అందరికి తెలిసిందే. ప్రపంచ దేశాలు కరోనా పేరు వింటేనే వణికిపోయాయి. ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసిన కరోనా గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టింది. అందరూ హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకునే లోపే పరిస్థితి ఒక్కసారిగా మారింది. భారత్‌లో కరోనా కేసులు ప్రస్తుతం పెరుగుతుండడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టీకాల పంపిణీపై కేంద్రం చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
Read Also: Relief For Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. 25వరకూ అరెస్ట్ వద్దన్న హైకోర్ట్
రేపటి (బుధవారం) నుంచి తెలంగాణలో మళ్లీ కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ చేయనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా నిలిపివేయడంతో తెలంగాణ ప్రభుత్వం టీకాల పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. 5 లక్షల కార్బేవ్యాక్స్ టీకా డోసులను ప్రజలకు రాష్ట్ర సర్కారు అందుబాటులోకి తెచ్చింది. బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నా బూస్టర్ డోస్‌గా కార్బే వ్యాక్స్ తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.