మనీలాండరింగ్ కేసులో బుధవారం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో హేమంత్‌ను జైలుకు తరలించారు.
ఇదిలా ఉండగా తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ హేమంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని సోరెన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించబోతున్నారు.
ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 24 గంటలు గడుస్తోంది. మరోవైపు తదుపరి ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్‌కు తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు ప్రమాణస్వీకారానికి మాత్రం పిలువలేదు. దీంతో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి భయాందోళన చెందుతోంది. ప్రభుత్వాన్ని అస్థితరపర్చడానికి కుట్ర జరుగుతోందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. కూటమికి చెందిన 47 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో మూడుసార్లు ఝార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన వచ్చింది. తాజాగా హేమంత్ సోరెన్ అరెస్ట్‌తో మరోసారి అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇంకోవైపు జేఎంఎంకు కావాల్సిన మద్దతు లేదని బీజేపీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్‌లో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.