China Corona: కరోనాకు పుట్టినిల్లు చైనాలో మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. వరుసగా రోజుకు 40వేలకు పైగా పాజిటివ్ కేసులు అక్కడ వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్ని ఆంక్షలు అమలు చేస్తోన్న వైరస్ వ్యాప్తి కొనసాగుతోనే ఉంది. జీరో కోవిడ్ పాలసీ చేపడుతున్న చైనా ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే కేసులు అదుపులో లేకుండా పోతాయేమోనన్న భయాందోళనలో ప్రభుత్వం ఉంది. ఇంకోవైపు చైనాలో పెరుగుతున్న కరోనా కేసులతో వెంటిలేటర్లు, ఆక్సిజన్ యంత్రాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. బ్రిటన్ డైయిలీ ఫైనాన్సియల్ టైమ్స్ కథనం మేరకు చైనాలో 1.20 కోట్ల మంది వీటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. చైనాలో గ్రామీణ ప్రాంతాల్లో అరకొర వైద్య సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. దీంతో, అక్కడి పౌరులు ముందు జాగ్రత్త చర్యగా లైఫ్ సేవింగ్ పరికరాల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది.
ఇదిలా ఉంటే చైనాలోని పలు నగరాల్లో క్వారంటైన్ గదులు, ప్రత్యేక ఆస్పత్రుల నిర్మాణం చేపట్టింది అక్కడి ప్రభుత్వం. మేక్ షిఫ్ట్ పద్ధతిలో నిర్మిస్తున్న ఈ కట్టడాలను కరోనా బాధితులను క్వారెంటైన్ లో ఉంచేందుకు ఉపయోగించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సుమారు 1.30 లక్షలకు పైగా జనాభా ఉన్న గ్వాంగ్జూ సిటీ శివార్లలో ప్రత్యేక ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి. ఆందోళనకారులపై భాష్పవాయుగోళాలను, పెప్పర్ స్ప్రేలను ప్రయోగిస్తున్నారు. ఈ అణచివేత చర్యలను ఐక్యరాజ్యసమితి ఖండించింది. శాంతియుతంగా ఆందోళన చేసేవారి హక్కులను గౌరవించాలని సూచించింది. చైనాలో జరుగుతున్న ప్రజా ఆందోళనలకు మద్దతుగా శాన్ ఫ్రాన్సిస్కో, టొరెంటో, డబ్లిన్, ఆమ్స్ టర్ డామ్, పారిస్ నగరాల్లో సైతం నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.