సినీ నటి, బీజేపీ మండి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ పై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య మరోసారి ఫైర్ అయ్యారు. కంగనా రనౌత్ కేవలం ఎన్నికల కోసం దిగుమతి చేసుకున్న నాయకురాలని విక్రమాధిత్య సింగ్ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఆమె మండి నియోజక వర్గంలో ఎలాగో ఓడిపోతుందని.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అన్ని ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మండి నియోజకవర్గంలో అయితే రాష్ట్రానికి దిగుమతి చేయబడిన కంగానా రనౌత్ ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. మండిలో ప్రతి రోజు రాత్రి పగలు పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందన్నారు.
READ MORE: BJP Leaders: నేడు రాష్ట్రానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఎవరెవరు అంటే..
కాగా.. గత నెలలో కూడా విక్రమాధిత్య కంగనా రనౌత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కంగానా రనౌత్ వర్ష కాలంలో వచ్చే కప్ప లాంటి వారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారం అనంతరం మండి నుంచి ఆమె వెళ్లిపోతుందని పేర్కొన్నారు. కంగనా హిమాచల్ ప్రదేశ్ కు కేవలం టూర్ కోసమే వస్తారని విమర్శించారు. ఈ రోజు ఇక్కడ ఉంటారు. రేపు మళ్లీ వెళ్లిపోతారన్నారు. ఆమెకు బీజేపీ ఎంపీ సీటు ప్రకటించినప్పుడు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ వేరు.. రాజకీయం వేరని.. రాజకీయం పరంగా ఆమెకు ఎటువంటి నాలెడ్జ్ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నేత కావాలా.. స్టార్ డమ్ నేతలు కావాలో నిర్ణయించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి, సిమ్లా, కాంగ్రా, మహీపూర్లో చివరి విడత జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.