Weather News: తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వచ్చే 48 గంటల్లో కేరళలోకి రుతుపవానాలు ప్రవేశించనున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా నైరుతి రుతుపవనాలు దక్షిణాదిలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి కూడా పరిస్థితులు అనువుగా ఉన్నాయని వెల్లడించింది.
Read Also: Maharastra: ఔరంగజేబు, టిప్పు సుల్తాన్‌పై సోషల్ మీడియా పోస్ట్‌లు.. రణరంగంగా కొల్హాపూర్..
అరేబియా సముద్రం, మొత్తం లక్షద్వీప్ ప్రాంతం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, మరిన్ని భాగాలు నైరుతి & మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ & పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ/ నైరుతి గాలులు వీస్తున్నాయి.
Read Also: MLA Seethakka: ములుగును టార్గెట్ చేస్తున్నారు.. కేటీఆర్ పర్యటనపై ఎమ్మెల్యే సీతక్క కామెంట్స్
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశమున్నట్లు తెలిపింది వాతావరణశాఖ. మరోవైపు ఈదురు గాలులు గంటకు 30 – 40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది. అటు తెలంగాణలో కూడా రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం బుధవారం బలహీనపడిందని తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.