తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. మరోవైపు.. నిన్న తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని ఏఐసీసీ మార్చింది. కొత్త ఇంఛార్జ్ నియామకం నేపథ్యంలో రాహుల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత నెలకొంది. అంతేకాకుండా.. ఖాళీ కానున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా అభ్యర్థుల ఎంపికపై కూడా రాహుల్ తో సీఎం చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే.. త్వరలో సూర్యాపేట, ఏప్రిల్‌లో గద్వాల్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో కులగణన పూర్తి అయిన సందర్భంగా సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట సభకు రావాలని రాహుల్ గాంధీని స్వయంగా ఆహ్వానించనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
Read Also: Rakul: కెరీర్ కోసం తిప్పలు తప్పవు : రకుల్ ప్రీత్ సింగ్
రాహుల్ గాంధీ వెసులుబాటును బట్టి సభను నిర్వహించే తేదీ పై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కూడా సీఎం రేవంత్ రెడ్డి అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అమలుపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏప్రిల్‌లో గద్వాల్ లేదా మెదక్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం నిర్వహించే సభకు రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఆహ్వానించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలో స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల నేపథ్యంలో.. రెండు భారీ బహిరంగ సభల ద్వారా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా, విస్తృతంగా తీసుకెళ్ళాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.
Read Also: Nizamabad: నిజామాబాద్ మార్కెట్ యార్డులో టెన్షన్ టెన్షన్..