Addanki Dayakar : ఎటువంటి పరిస్థితుల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నష్టం కలిగించే ప్రయత్నం చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోరని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పక్కన ఉన్న సర్వే నెంబర్ 25లో గల 400 ఎకరాల భూమిని సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో పోరాటం చేసి సాధించారని అద్దంకి దయాకర్ తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ, న్యాయపరమైన మార్గంలోనే భూమిని రాబట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. ఈ భూమిని అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, కేటీఆర్ ఈ భూములను వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించాలని చూశారని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని అద్దంకి దయాకర్ గుర్తుచేశారు. అందువల్లే ఈ భూమి ఇప్పటికి ప్రభుత్వ ఆధీనంలో ఉందని, విద్యార్థులకు నష్టం కలగకుండా రేవంత్ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. 1970లలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ HCU కోసం 2500 ఎకరాల భూమిని కేటాయించారని అద్దంకి దయాకర్ తెలిపారు. కానీ ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థుల భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని అద్దంకి దయాకర్ ఆరోపించారు. విద్యార్థులను సెంటిమెంట్‌తో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రభుత్వంపై నెగటివ్ ప్రచారం చేయడమే వారి లక్ష్యమని అన్నారు. బీఆర్ఎస్ అనుబంధ సంఘాలు బ్యాక్‌గ్రౌండ్‌లో జేసీబీలు, వన్యప్రాణులు ఉన్నట్లు సోషల్ మీడియాలో కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అద్దంకి దయాకర్ తెలిపారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే కుట్ర బీజేపీ, బీఆర్ఎస్ కలసికట్టుగా చేస్తున్నాయని ఆరోపించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందే రాష్ట్రంలో భూములు ఆదాయ వనరుగా మారాలని ప్రభుత్వం భావిస్తోందని, విద్యార్థులకు ఏమాత్రం నష్టం కలగకుండా ప్రభుత్వ విధానాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
Supreme Court: “బుల్‌డోజర్ యాక్షన్”.. యూపీ సర్కార్‌పై సుప్రీం తీవ్ర ఆగ్రహం..