Supreme Court: ఉత్తర్ ప్రదేశ్ సర్కార్‌ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. బుల్‌డోజర్ యాక్షన్‌పై ప్రయాగ్‌రాజ్ పరిపాలన విభాగాన్ని తీవ్రంగా విమర్శించింది. కూల్చివేత చర్య ‘‘రాజ్యాంగ విరుద్ధం’’, ‘‘అమానవీయ’’ అని పేర్కొంది. బుల్డోజర్ యాక్షన్ మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది’’ అని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బాధిత ఇంటి యజమానులకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
తగిన చట్టబద్ధమైన ప్రక్రియ పాటించకుండా ఒక న్యాయవాది, ఒక ప్రొఫెసర్, మరికొందరి ఇళ్లను కూల్చివేసినందుకు యూపీ ప్రభుత్వాన్ని కోర్టు తీవ్రంగా విమర్శించింది. తమ ఇళ్లను కూల్చివేసే ఒక రాత్రి ముందు తనకు నోటీసులు అందించినట్లు న్యాయవాది జుల్ఫికర్ హైదర్, ప్రొఫెసర్ అలీ అహ్మద్, మరో ముగ్గురు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2023లో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌కి చెందిన వారిగా తమను పొరపడి అధికారులు తమ ఇళ్లను కూల్చేసినట్లు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.
Read Also: Sanjay Raut: అద్వానీకి షాజహాన్ పరిస్థితి.. మోడీపై సంజయ్ రౌత్ విమర్శలు..
కూల్చివేత నోటీసులు అందించిన విధానంపై కూడా కోర్టు అధికారుల్ని మందలించింది. ఆస్తులపై నోటీసులు అంటించామని రాష్ట్రం తరుపు న్యాయవాది చెప్పగా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపారని కోర్టు ప్రశ్నించింది. వారికి రూ. 10 లక్షలు పరిహారం చెల్లించాలని, దీని వల్ల మరోసారి అధికారులు తగిన ప్రక్రియ అనుసరించాలని గుర్తుంచుకుంటారని జస్టిన్ ఓకా అన్నారు.
ఇళ్లు కూల్చేవేత విషయంలో బాధితులకు ప్రతిస్పందించడానికి సరైన అవకాశం కల్పించలేదని కోర్టు పేర్కొంది. ఆశ్రయం పొందే హక్కు కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో అంతర్భాగమని అధికారులు గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. ఇలా కూల్చివేతలను నిర్వహించడం అధికారం వైపు నుంచి అసమర్థతను చూపుతుందని కోర్టు పేర్కొంది. యూపీ అంబేద్కర్ నగర్‌లో కూల్చివేత సమయంలో ఒక అమ్మాయి తన పుస్తకాలను పట్టుకుని ఉన్న వీడియో గురించి కూడా కోర్టు ప్రస్తావించింది. ఇలాంటి దృశ్యాల వల్ల అందరూ కలత చెందుతున్నారని జస్టిస్ భూయాన్ అన్నారు.