CM KCR Tribute to Professor Jayashankar
తెలంగాణ భవన్‌లో నేడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే తాజాగా.. తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం నివాళులర్పించారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పాలకుల హయాంలో తెలంగాణకు ఎదురైన నష్టాలు, కష్టాలను వివరిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపి ప్రత్యేక తెలంగాణ కోసం జయశంకర్ కలలు కన్నారని తెలిపారు.
జయశంకర్ స్ఫూర్తితో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కొనసాగించి మొక్కవోని దీక్షతో ధైర్యంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. జయశంకర్ ఆశించిన విధంగా స్వయం పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అణగారిన వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ ప్రజల ప్రగతిని సాధిస్తూ జయశంకర్ కలలను సాకారం చేస్తోందని అన్నారు సీఎం కేసీఆర్.