CM KCR Speech in BRS Praja Ashirvada Sabha at Bellampalli: సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అసమర్థత వల్లే సింగరేణిలో వాటాను కోల్పోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి.. 49 శాతం వాటాను వారికి కట్టబెట్టారని గుర్తు చేశారు. అప్పటి నుంచి అప్పుల్లోనే ఉన్న సింగరేణి.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే లాభాల బాట పట్టిందని వెల్లడించారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్సేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేసే ముందు ఆలోచించాలని.. ఆగం కావద్దని సీఎం సూచించారు.
Also Read: CM KCR: రేపు గజ్వేల్‌లో నామినేషన్ వేయనున్న సీఎం కేసీఆర్
చెన్నూర్‌లో చెల్లని రూపాయి బెల్లంపల్లిలో చెల్లుతదా.. చెన్నూర్‌లో నాలుగు సార్లు ఓడిపోయిన వినోద్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు సెల్ఫ్ లేదని.. ఢిల్లీలో కట్కా వేస్తేనే ఇక్కడ బుగ్గ వెలుగుతదని సీఎం పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకున్నాడని రోజూ గాంధీ భవన్ వద్ద లొల్లి నడుస్తోందన్నారు. గాంధీ భవన్ గేట్‌కు తాళం వేస్తున్నారని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. టికెట్లను అమ్ముకునే వాళ్లు రేపు రాష్ట్రాన్ని అమ్ముకోరా అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేసిందని సీఎం అన్నారు. రైతులకు రైతుబంధు కొనసాగాలంటే.. అది రూ.10 వేల నుంచి రూ.16వేలకు పెరగాలంటే కచ్చితంగా బీఆర్‌ఎస్ గెలవాలన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిపించకుండా వేరే పార్టీని గెలిపించి మోసపోతే గోసపడతామని సూచించారు. ప్రతి సింగరేణి కార్మికుడికి రూ.2.50 లక్షలు వస్తున్నాయని వివరించారు. భూవివాదాలు ఉండకూడనే ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు జరిగేవని ఆరోపించారు. ప్రస్తుతం ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే అర్ధగంటలోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “ఎన్నికలు వస్తాయి పోతాయి.. అభ్యర్థి గుణాలు, ఆయన వెనుకున్న పార్టీ ఏంటో చూసి ఓటు వేయండి. చెన్నూర్‌లో చెల్లని రూపాయి బెల్లంపల్లిలో చెల్లుతుందా. మంది మాట పట్టుకొని మారుమూలకు పోతే.. మళ్ళచ్చే వరకు ఇల్లు కాలినట్టు అయితది. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో దళితుల గురించి పార్టీలు ఎందుకు ఆలోచించలేదు.. దళితబంధు తెచ్చిన పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ. బెల్లంపల్లికి 134 ఏళ్ల సింగరేణి చరిత్ర ఉంది. ఎన్నికల్లో నోట్ల కట్టలను తెచ్చుకునేటోల్లను కాదు, ప్రజల్లో ఉండే ఉండే చిన్నయ్యను గెలిపించండి.ఇప్పటికే సింగరేణి ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్న 10 వేల ఇండ్లకు పట్టాలు ఇచ్చినం. మిగతా వారికి కూడా ఇస్తాం. రైతుబీమా 5 లక్షలు ఇస్తున్నాం. రాహుల్ గాంధీ, రేవంత్ , భట్టి మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ గెలిస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నరు. కాంగ్రెస్ వాళ్ళను తీసి బంగాళాఖాతంలో వేయాలే. భారత దేశంలో 24గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నంబర్ వన్‌లో ఉంది.” అని సీఎం అన్నారు.