CM KCR: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నుంచి కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రేపు గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించిన పత్రాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. ఈ నెల 3న కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్.. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. రేపు రెండు స్థానాలకు నామినేషన్ వేసిన తర్వాత కామారెడ్డిలో ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్. గజ్వేల్‌లో నామినేషన్ వేసిన తర్వాత హెలికాప్టర్‌లో కామారెడ్డిలోని పోలీసు కార్యాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్ద దిగనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. నామినేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున జనం తరలొచ్చేలా బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో, మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు కేసీఆర్.
Also Read: Minister KTR: మీరు చూసింది ట్రైలర్ మాత్రమే.. ఇంకా చాలా ఉంది..
ఈ నేపథ్యంలో గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ నామినేషన్ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. డీకేలు వచ్చినా, పీకేలు వచ్చినా మా ఏకే 47.. కేసీఆర్‌ను ఏం చేయలేరని మంత్రి హరీశ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే పెద్దవాళ్ళం అవుతామని అనుకుంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్‌కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరన్నారు. పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. ఎక్కడినుండి నిన్న జనం వచ్చారో ప్రజలందరికీ తెలుసన్నారు. తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతున్నారని మంత్రి హరీశ్ చెప్పారు. కరెంట్ గురించి రేవంత్ అన్న మాట, వీడియో అందరూ చూశారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి చెప్పారు. కుల్లం కుల్లం అన్నావు.. గూగుల్ చేసి చూడు రేవంత్ రెడ్డి అంటూ హరీశ్ వ్యాఖ్యానించారు.