ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 11:30 గంటలకు యూఎస్ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. యూఎస్ ప్రతినిధులతో జీరో బడ్జెట్ నేచర్ ఫార్మింగ్‌పై అవగాహన ఒప్పందం జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 12:30 వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్‌పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు.
వివిధ శాఖల సమీక్షలో బడ్జెట్‌పై ఆర్ధిక శాఖ కసరత్తు చేయనుంది. సీఎం చంద్రబాబు సూచనలతో సంక్షేమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనుంది. కేంద్రం నుంచి వస్తున్న నిధుల ఆధారంగా ఏపీ బడ్జెట్ 2025-26 కేటాయింపులు ఉంటాయి. గత బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లు కాగా.. 2025-26 బడ్జెట్ రూ.3 లక్షల 15 వేల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ కూర్పుపై ఢిల్లీ నుంచి వచ్చాక మరోసారి సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.
ఇక సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ తరఫున చంద్రబాబు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. సీఎం ఢిల్లీ వెళుతుండటంతో ఫిబ్రవరి 20న జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. సీఎం చంద్రబాబు బుధవారం సాయంత్రం 4.55 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరి వెళతారు. గురువారం సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం సాయంత్రం 6.10 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు.