CM Chandrababu: అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించునున్నారు. షెడ్యూల్ ప్రకారం.. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10:45 గంటలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోనున్న సీఎం.. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం 11:05 నుంచి 12:05 గంటల వరకు ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ వన్, గ్యాప్ టూ, డీ వాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనున్నారు.
Read Also: Pawan Kalyan: తెలుగు వారికి ఓ గుర్తింపు ఇచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు
పోలవరంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. 600 మందికి పైగా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి రానున్నారు. ఈ ఏడాది జూన్ 17న మెుదటిసారి ఆయన ఆ ప్రాజెక్టును సందర్శించారు. మరోసారి పోలవరాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఇంజినీర్లతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి వచ్చేనాటికే ప్రధానమైన ఆనకట్ట ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చించనున్నారు.