బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. వందేళ్ల నుంచి గోదావరిలో ఏటా సగటున 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందన్నారు. వృథా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు అని తెలిపారు. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, ఇకపై కూడా చెప్పను అని చెప్పారు. సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు.
‘బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు. కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారు. వృథా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే మా ఉద్దేశం. ఏటా సగటున 2 వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. వృథా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు, ఇకపై కూడా అభ్యంతరం చెప్పను. సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి. నీటి సమస్య పరిష్కారమైతే తెలుగు ప్రజలు బాగుంటారు’ అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: CM Chandrababu: రైతులను ఆదుకునే ప్రభుత్వం మాది.. ఎప్పుడైనా వైసీపీ కొనిందా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య బనకచర్ల ప్రాజెక్టు తీవ్ర వివాదంగా మారింది. ఎలాగైనా బనకచర్లను అడ్డుకుంటామంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. మిగులు జలాలనే కదా? మేం వాడుకునేది, అభ్యంతరాలు ఎందుకంటూ ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది. దీనిపై కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదులు కూడా చేశారు తెలంగాణ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి. అనంతరం ఏపీ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) తీర్పును పరిశీలించాల్సి ఉందని చెప్పింది. పర్యావరణ అనుమతులకు సీడబ్ల్యూసీని సంప్రదించడం అవసరమని అభిప్రాయపడింది.