ఆ యువకుడిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. తండ్రి జీతం ఉంటూ, తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఈ సమయంలో ఆ యువకుడు తన తమ్ముళ్లని చెల్లిని ఆడించేవాడు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రి జీతం ఉన్న ఇంట్లోనే పశువుల కాపరిగా చేరి నాలుగేళ్లు పనిచేసి కుటుంబానికి అండగా నిలిచాడు. అప్పటికి యువకుడి వయసు 13 ఏళ్లు. బడి అంటే ఏంటో తెలియదు. ఆ సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అతడిని గుర్తించారు.
Also Read:Pune: పూణెలో దారుణం.. యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం.. సెల్ఫీ తీసుకుని ఏం రాశాడంటే..!
చదువంటే ఇష్టమని చెప్పగా ఏడాదిపాటు బ్రిడ్జి కోర్సు గురించి ఆయన వివరించి అతడిని చదువు బాట పట్టించారు. అలా 14 ఏళ్ల వయసులో బడిబాట పట్టి 35 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పూర్తి చేసి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. శ్రమ నీ ఆయుధం అయితే.. విజయం నీ బానిస అవుతుందని నిరూపించాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరా అని ఆలోచిస్తున్నారా? అతడు మరెవరో కాదు.. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనగుల గ్రామానికి చెందిన చింతా పరమేశ్.
Also Read:Konda Murali: ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ, మురళి భేటి.. సంచలన వ్యాఖ్యలు
ఆనాడు పశువుల కాపరిగా పనిచేసిన చింతా పరమేశ్ తాజాగా ఓయూ జియాలజీ విభాగం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. కాగా పాఠశాలకు పోకపోయినప్పటకీ దసరా పండుగకు కొత్త దుస్తులుగా స్కూల్ యూనిఫామ్ కుట్టించుకోవడం చింతా పరమేశ్ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. యూనిఫామ్ ధరించి ఊళ్లో గుడి వద్ద జరుగుతున్న జాతరకు వెళుతుంటే ఎంవీ ఫౌండేషన్ కార్యకర్త మౌలాలీ గమనించి వివరాలు సేకరించారు. రాంపూర్‌లో ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రిడ్జ్ క్యాంపు ఉందని.. అందులో చదువుకోవచ్చని చెప్పాడు.
Also Read:Sonam Raghuwanshi: హనీమూన్ కి తీసుకెళ్లి భర్తను చంపిన సోనమ్ రఘువంశికి.. పిండదానం చేసిన మహిళలు
తల్లిదండ్రులను ఒప్పించిన పరమేశ్ అందులో చేరాడు. 14 ఏళ్ల వయసులో అక్కడి నుంచే ఏడో తరగతి బోర్డు పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ టెన్త్ లో ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. కల్వకుర్తిలోని గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ సైఫాబాద్‌లోని సైన్స్ కళాశాలలో బీఎస్‌సీ, ఓయూ ప్రాంగణంలో ఎంఎస్‌సీ జియాలజీ పూర్తి చేశాడు. పీజీలో 85 శాతం మార్కులతో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడయ్యాడు.
Also Read:Nayanthara: నన్ను వాడుకున్నారు.. నయన్ షాకింగ్ కామెంట్స్
పీజీలో ఉత్తమ మార్కులు సాధించడంతో పరమేశ్ ఓయూలో పీహెచ్‌డీ సీటు సంపాదించాడు. రాజీవ్‌గాంధీ నేషనల్ ఫెలోషిప్‌నకు ఎంపిక కావడంతో పీహెచ్‌డీ పూర్తి చేయడం సులభమైంది. ఆచార్య మురళీధర్ పర్యవేక్షణలో అమ్రాబాద్, పదర మండలాల్లో భూగర్భ జల పరిస్థితులపై అధ్యయనం చేసి పరిశోధనా పత్రం సమర్పించారు. 35 ఏళ్ల వయసులో ఇటీవల పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో జియాలజిస్టుగా పనిచేస్తున్నారు. చింతా పరమేశ్ నేటి తరానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. నేటి రోజుల్లో ప్రభుత్వాలు, తల్లిదండ్రులు పిల్లలకు చదువుకోవడానికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేస్తూ చెడు అలవాట్ల బారిన పడుతున్న యువత చింతా పరమేశ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. చింతా పరమేశ్ సాధించిన సక్సెస్ పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.