రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను విస్మరించిందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని వైఎన్ఆర్ గార్డెన్స్లో భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆటో డ్రైవర్లు, లైట్ వెయిట్ మోటార్ వెహికల్ డ్రైవర్లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రతి నెల జీవన భృతి కల్పిస్తామని చెప్పి మాట తప్పిందని ఆరోపించారు. తాను చేవెళ్లలో ఎంపీగా విజయం సాధించడం, దేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం తధ్యమని అన్నారు. చేవెళ్లలో కానీ ఎంపీగా గెలవగానే ఆటో డ్రైవర్లకు స్వయంగా ఆటోలు కొనుక్కోవడానికి లోన్లు కల్పించడంతో పాటు అర్హులందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంత ఇంటికి పంపిస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన భారతీయ మజ్దూర్ యూనియన్ ముఖ్య నాయకులు, సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Lok Sabha Elections 2024: యానిమేటెడ్ వీడియో వివాదం.. జేడీ నడ్డా, అమిత్ మాల్వీయాపై కేసు నమోదు..
మరోవైపు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి కొండా సంగీతా రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ, చేవెళ్ల పార్లమెంటు ప్రజలంతా కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటే ఉన్నారని తెలిపారు. సోమవారం ఆమె మహేశ్వరం నియోజకవర్గంలోని అమీర్ పేట్, మాణిక్యమ్మ గూడ, కేకే బస్తీ, సుబాన్ పూర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో మరోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు చేవెళ్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని.. వారంతా మరోసారి మోడీని ప్రధాని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వం పట్ల, ప్రజాసేవపై ఆయనకున్న శ్రద్ధాసక్తులు ప్రజలందరినీ విశేషంగా ఆదరించాయని అన్నారు. మే 13న జరగనున్న పోలింగ్లో ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి వచ్చి భారీ మెజార్టీతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలిపించాలని సంగీతారెడ్డి పిలుపునిచ్చారు.