నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోని ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్‌లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు చంద్రబాబు. ఈ రోజు సాయంత్రం 3.50 గంటలకు నెల్లూరు నుంచి కౌతాలంకు వస్తారు. రాత్రి గూడూరులోనే బస చేస్తారు చంద్రబాబు. కాగా చంద్రబాబు నాయుడు సోమవారం నందికొట్కూరులో పర్యటించనున్నారని ఆ పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. శనివారం అల్లూరు గ్రామ సమీపంలో హెలిప్యాడ్ స్థలాన్ని మాండ్ర శివానందరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు.
అనంతరం మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు హెలికాప్టర్‌లో అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారని, అక్కడి నుంచి నందికొట్కూరు అల్లూరు సర్కిల్, కొత్త బస్టాండ్ మీదుగా పటేల్ సెంటర్ వరకు రోడ్డు షో, పటేల్ సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. అనంతరం అల్లూరు గ్రామం వద్ద బస చేస్తారన్నారు. 30వ తేదీ ఉదయం అక్కడి నుంచి బయలుదేరతారని ఆయన తెలిపారు. హెలిప్యాడ్ ప్రదేశాన్ని పరిశీలించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య, నియోజకవర్గ పరిశీలకుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్‌రెడ్డి ఉన్నారు.