BL Verma: దేశంలో అభివృద్ధి జరగాలంచే డబులు ఇంజిన్ సర్కారు రావాల్సిందేనని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సీనియర్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 1980లో జన సంఘ్‌తో ప్రారంభమైన పార్టీ.. కార్యకర్తల కృషితో ఈ రోజు ఇంత పెద్ద పార్టీగా అవతరించిందని కేంద్ర మంత్రి చెప్పారు. సీనియర్ కార్యకర్తలే పార్టీకి పునాది రాళ్లు అని.. సీనియర్ కార్యకర్తలు వారి అనుభవాన్నీ, నైపుణ్యతను పార్టీ అభివృద్ధికి వినియోగించాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో అత్యధిక ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిగిన ఎకైక పెద్ద పార్టీ బీజేపీనే అని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 9 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసంఘ్ కార్యక్రమం ద్వారా ప్రధాని దేశవ్యాప్తంగా ప్రజలను నేరుగా కలవనున్నారని ఆయన చెప్పారు.
Read Also: Marriage Record: 12 గంటల్లో 2000 జంటలకు పెళ్లి.. వరల్డ్ రికార్డ్ క్రియేట్..
“2014కు పూర్వం చాలా ప్రభుత్వాలు అధికారం చెలాయించాయి.గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని ప్రధాని అనతి కాలంలో చేసి చూపించారు. పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి మోడీ కృషి చేస్తున్నారు. 11 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ పేరుతో 6వేల రూపాయల పంట పెట్టుబడి అందిస్తున్నారు. రైతులపై భారం పడకుండా ఎరువుల ధర తగ్గించి అందిస్తున్నారు. పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర అందిస్తున్నారు. మోడీని అడ్డుకోవడానికి అవినీతి పరులంతా ఒక్కటవుతున్నారు. గత ప్రభుత్వాల పాలనలో 74 ఎయిర్ పోర్ట్ లు నిరిస్తే , మోదీ పాలనలో 75 ఎయిర్ పోర్టుల నిర్మాణం జరిగింది. కరోనా కాలంలో 80కోట్ల మంది ప్రజలకు 5కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేశాం. అనతి కాలంలో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చి 3 సార్లు అందించడం జరిగింది.శరవేగంగా ఎదుగుతున్న దేశాలలో ప్రపంచంలోనే మన దేశం 5వ స్థానంలో ఉంది. అభివృద్ధి జరగాలంటే డబులు ఇంజిన్ సర్కార్ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.” అని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ స్పష్టం చేశారు.