జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యం కేసు ముగిసింది. ఈ కేసును కోజ్ చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ ముగింపు నివేదికను కోర్టు అంగీకరించింది. నజీబ్ అహ్మద్ అక్టోబర్ 15, 2016 నుంచి కనిపించకుండా పోయాడు. 2018లో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. సీబీఐ నివేదికలో నజీబ్ మిస్సింగ్‌పై ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదని సీబీఐ పేర్కొంది. ఆ మేరకు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జ్యోతి మహేశ్వరి సోమవారం సీబీఐ క్లోజర్ నివేదికను ఆమోదించారు. అయితే భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించిన ఏవైనా కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తే, కేసును తిరిగి తెరవవచ్చని కోర్టు స్పష్టం చేసింది. నజీబ్‌ను గుర్తించడంలో ఏజెన్సీకి ఎటువంటి విజయం లభించకపోవడంతో, 2018 అక్టోబర్‌లోనే ఈ కేసులో దర్యాప్తును సీబీఐ ముగించింది. ఢిల్లీ హైకోర్టు నుండి అనుమతి పొందిన తర్వాత, ఏజెన్సీ తన ‘క్లోజర్ నివేదిక’ను కోర్టు ముందు దాఖలు చేసింది.
READ MORE: Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వాన..!
అసలు ఎవరు ఈ నజీబ్..
2016లో 27 సంవత్సరాల వయసున్న నజీబ్.. జేఎన్‌యూ స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీలో ఎంఎస్‌ఈ చదువుతున్నాడు. నజీబ్ అదృశ్యం కావడానికి ఒక రోజు ముందు.. అంటే అక్టోబర్ 15, 2016న జేఎన్‌యూలోని మహి-మాండ్వి హాస్టల్‌లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) విద్యార్థులతో జరిగిన ఘర్షణ జరిగింది. తర్వాత అతను కనిపించకుండా పోయాడు. దీంతో నజీబ్ అదృశ్యం కేసు ఊపందుకుంది. మొదట్లో ఢిల్లీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. అనంతరం మే 16, 2017న, నజీబ్ అహ్మద్ అదృశ్యం కేసుపై సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్ 29, 2017న, నజీబ్ గురించి సమాచారం ఇచ్చిన వారికి సీబీఐ రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది. కానీ ఎటువంటి ఆధారాలు లభించలేదు. నజీబ్ తరఫు న్యాయవాది గతంలో ఈ కేసును రాజకీయ అంశంగా అభివర్ణించారు. సీబీఐ కేంద్రం ఒత్తిడికి తలొగ్గిందని ఆరోపించారు.