KTR : తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అపార్థం చేసుకోవడం దారుణమని, తాము ప్రజా సంక్షేమం కోసం చేసిన ఖర్చును అప్పుగా చిత్రీకరించడం అన్యాయమని మండిపడ్డారు. కేటీఆర్ తన బహిరంగ లేఖలో, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 65 ఏళ్లలో 14 ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేసినా, బీజేపీ ప్రభుత్వం కేవలం 10 ఏళ్లలో రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ 2014లో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిందని, అప్పటికే రూ.70 వేల కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడిందని స్పష్టంచేశారు. అయినప్పటికీ, బీఆర్ఎస్ పాలన తర్వాత కూడా రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్‌కు అప్పగించామని తెలిపారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి పైసా పెట్టుబడిగా మారిందని, అభివృద్ధికి వినియోగించామని కేటీఆర్ వివరించారు. తెలంగాణకు సాగు, తాగునీటి కష్టాలను పరిష్కరించేందుకు భారీ ప్రాజెక్టులు నిర్మించామని, పారిశ్రామికరంగ అభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు. బీజేపీ తీసుకున్న అప్పుతో ఏమి చేసిందో వివరించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో తెలంగాణకు న్యాయమైన వాటా కూడా ఇవ్వలేదని, విభజన హామీలను నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రత్యేకంగా పసుపు బోర్డుకు ఒక్క పైసా కేటాయించకపోవడం, ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేయడం తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించిందన్నారు. అదేవిధంగా, బీఆర్ఎస్ సొంత నిధులతో నిర్మించిన మిషన్ భగీరథను జల్ జీవన్ మిషన్‌లో భాగమని ప్రచారం చేయడం విడ్డూరమన్నారు.
Hollywood: ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత..
తెలంగాణకు ఎనిమిది బీజేపీ ఎంపీలు ఉన్నా, రాష్ట్రానికి ఏ రకాల ప్రయోజనాలు అందించలేదని, అభివృద్ధికి ఎటువంటి సహాయాన్ని కేంద్రం చేయలేదని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ పాలనలో కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రయోజనం కలిగిందని, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఎలాంటి మేలు జరగలేదని ఆయన ఆక్షేపించారు. కేవలం బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న అప్పులను ఎత్తిచూపి ప్రజలను మభ్యపెట్టడం బీజేపీ రాజకీయ తలంపులేనని కేటీఆర్ అన్నారు. తాము తీసుకున్న అప్పుతో అభివృద్ధి సాధించామని, కానీ బీజేపీ మాత్రం కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు మాత్రమే ఉపయోగించిందని ఆరోపించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడం, విభజన హామీలు నెరవేర్చకపోవడం, రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టడం ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు బీజేపీ తన పాలనను సమీక్షించుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే తమ ప్రాముఖ్యమని, రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. బీజేపీ మోసపూరిత ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరని, రాష్ట్ర హక్కుల కోసం పోరాడతామని తేల్చిచెప్పారు.
CM Chandrababu: రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పోకి హాజరు