BRS MPs Comments on Central Government: కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాల కంటే ముందే కేంద్రం చర్చకు రావాలని బీఆర్‌ఎస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ లోక్‌సభాపక్ష నేత, బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ బడ్జెట్ రైతులు, పేదల బడ్జెట్ అని.. కేంద్ర బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ అంటూ విమర్శించారు. తెలంగాణ బడ్జెట్‌లో విద్య, వైద్యానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంటే , తెలంగాణలో ప్రతి సంవత్సరం వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించకపోయినా, రాష్ట్రం తనకున్న వనరులతో అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందన్నారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి విషయంలో కేంద్రం అనవసర ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా కేంద్రం తెలంగాణకు సహకరించాలని కోరారు.
Jagga Reddy: పుస్తకమే చాలా లావుగా ఉంది.. అందులో మ్యాటర్ లేదు..
మూడు రోజులుగా అదానీ వ్యవహారంపై చర్చ కోరుతున్నామని.. సభలో చర్చించకుండా పారిపోతున్నారని బీఆర్‌ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కె.కేశవరావు అన్నారు. చర్చను ఆపడం వెన్నుపోటుతో సమానమన్నారు. రాజ్యసభ ఛైర్మన్ వాయిదా తీర్మానం నోటీస్ ఆర్డర్ లేదన్నారని ఆయన చెప్పుకొచ్చారు. తప్పించుకోవడం సమంజసం కాదన్నారు. సభను అడ్డుకోవడానికి కాదన్న ఆయన.. చర్చను కోరుతున్నామన్నారు. అదానీ వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. అదానీ వ్యవహారంపై ఫోకస్‌గా చర్చ జరగాలని.. అదానీ గురించి చర్చ జరపకుండా ఉద్దేశ పూర్వకంగానే కేంద్రం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. అదానీని రక్షించేందుకు, ఆయన స్టాక్స్ పడిపోకుండా కేంద్రం రక్షణాత్మక చర్యలు చేపడుతోందని కేశవరావు ఆరోపణలు చేశారు.