ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 8 మంది చిక్కుకొని ఉంటే.. ప్రభుత్వ హెలికాప్టర్‌లో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే నానా హంగామా చేశారని, కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని ప్రకృతి వైపరీత్యం అంటున్న ప్రభుత్వం.. కాలేశ్వరం ప్రమాదాన్ని అప్పటి ప్రభుత్వ వైఫల్యం అనడం విడ్డురంగా ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అవడం వలనే ప్రమాదం జరిగింది. మేము ప్రాజెక్టును ఆలస్యం చేశామనేది శుద్ధ తప్పు. మేము ఎస్‌ఎల్‌బీసీ కోసం అసెంబ్లీలో చర్చ పెట్టి అఖిలపక్షం ఏర్పాటు చేశాము. ఇది పూర్తి చేయడానికి వేల కోట్లు ఖర్చు పెట్టాము. ఎస్‌ఎల్‌బీసీ ప్రపంచంలోనే క్రిటికల్, సెన్సిటివ్ ప్రాజెక్ట్. ఇంత పెద్ద ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకొని ఉంటే.. ప్రభుత్వ హెలికాప్టర్‌లో వెళ్లి సీఎం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు.
‘కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్టులో అనుమతిస్తే ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదాన్ని ప్రకృతి వైపరీత్యం అంటున్న ప్రభుత్వం.. కాలేశ్వరం ప్రమాదాన్ని అప్పటి ప్రభుత్వ వైఫల్యం అంటుంది. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే నానా హంగామా చేశారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో మూడు ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగాయి. ఎస్‌ఎల్‌బీసీ లాంటి ప్రమాదమే కాళేశ్వరంలో కూడా జరిగింది కానీ.. మేము ఎంతో జాగ్రత్తగా దానిని రెక్టీఫై చేశాము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం అనుమానమే. కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకొని అయినా ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడాలి. 8 మంది ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుంటున్నాం’ అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.