Winter Season: చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టసాధ్యం. చిన్నపాటి అజాగ్రత్త కూడా రోగాలను చేరదీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో మీ ఆహారంలో శరీరానికి లోపలి నుండి వెచ్చదనం, పోషణను అందించే పదార్థాలను చేర్చుకోవడం అవసరం. చలికాలంలో విత్తనాలను తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మేలు చేసే చక్కని అలవాటు. ఈ విత్తనాలు ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఇంకా ఖనిజాలు వంటి పుష్టికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. విత్తనాలను పచ్చిగా తినవచ్చు లేదా వేయించి తీసుకోవడం వల్ల వాటిలోని పోషకాలు మరింతగా గ్రహించబడతాయి. చలికాలంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన విత్తనాల గురించి చూద్దాం.
గుమ్మడికాయ గింజలు (Pumpkin Seeds):
గుమ్మడికాయ గింజలు యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇంకా విటమిన్లతో నిండి ఉంటాయి. ఇవి కణాల ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, అలాగే చర్మం తేమను కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. గుమ్మడికాయ గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా విటమిన్ E మన చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. జుట్టు నాణ్యతను మెరుగుపరచడంలో కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి.
Also Read: Pushpa 2: ఇండియన్ సినీ రికార్డులను తిరగరాసిన పుష్ప-2 ది రూల్
అవిసె గింజలు (Flax Seeds) :
అవిసె గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కు అద్భుతమైన మూలం. ఇవి ఎముకలను బలంగా ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్- E చర్మాన్ని సున్నితంగా ఉంచి యవ్వనాన్ని కాపాడతాయి. ఇది చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో బాగా సహాయపడతాయి.
చియా విత్తనాలు (Chia Seeds):
చియా విత్తనాలు బరువు తగ్గడంలో ఎంత ప్రాచుర్యం పొందాయో, ఆరోగ్యానికి కూడా అంతే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఇంకా ఖనిజాలను కలిగి ఉంటాయి. చియా సీడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకలను బలపరుస్తాయి. కాబట్టి మీకు వీటిలో ఏవి అందుబాటులో ఉంటె అవి తినడానికి ప్రయత్నం చేయండి.
Also Read: Redmi 14C: 50MP డ్యూయల్ కెమెరాతో బడ్జెట్ ఫోన్‌ను రిలీజ్ చేయనున్న రెడీమి
ఇక విత్తనాలను ఎలా తీసుకోవాలన్న విషయానికి వస్తే.. వీటిని పచ్చిగా లేదా నానబెట్టి తీసుకోవడం ఉత్తమం. వీటిని మీ ఆహారంలో చేర్చి, సూప్ లలో, సలాడ్ లలో లేదా స్మూతీలలో ఉపయోగించవచ్చు. ఇంకా వేయించి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతూ రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు విత్తనాలు ఒక అద్భుతమైన ఎంపిక. అవిసె గింజలు, చియా సీడ్స్, గుమ్మడికాయ గింజలు లాంటి వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మంచి ఆరోగ్యానికి ఈ చలికాలంలో విత్తనాలు మీకు సహాయకరంగా నిలుస్తాయి.