నిజాం వ్యతిరేక పోరాటంలో నిజాంకు వ్యతిరేక పోరాటం చేసి అశువులు బాసిన అమరవీరుల స్మృతి కేంద్రాలను రేపు బీజేపీ నాయకులు ఉమ్మడి జిల్లాలో పర్యటించి ఘనంగా నివాళులర్పిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడింఒచారు. ఉమ్మడి జిల్లాలో వరంగల్ పరకాలలో, కరీంనగర్ హుస్నాబాద్ మండలం మమ్దాపురం, నిజామాబాద్ ఖిలా (జిల్లా జైలు), అదిలాబాద్ నిర్మల్ లో(1000 మందిని ఉరి తీసిన మర్రి చెట్టు), అదిలాబాద్ కోమరంభీమ్ జోడేఘాట్, మెదక్ బైరాన్ పల్లి (సిద్దిపేట జిల్లా), ఖమ్మం ఎరుపాలెం, నల్గొండ గుండ్రంపల్లి, మహబూబ్ నగర్ అప్పన్పల్లి, హైదరాబాద్ కాచిగూడ షోయుభుల్లాఖాన్ విగ్రహం వద్దకు బీజేపీ నేతలు చేరుకొని నివాళులు అర్పిస్తారని ఆయన వెల్లడించారు. నిజాం ప్రభుత్వంతో వీరోచితంగా పోరాడిన వ్యక్తుల పట్ల తెలంగాణ ప్రభుత్వం సరైన విధంగా నివాళులర్పించడంలో, అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలో వెనుకడుగు వేస్తున్నదని ఆయన విమర్శించారు.
బీజేపీ గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అనేక ఉద్యమాలను పోరాటాలను చేసిందని, తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా పోరాటాల ఫలితంగానే నేడు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం కాకుండా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం జరపడం తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదన్నారు.