రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది. ఊహిస్తేనే మతిపోతుంది. చూడ్డానికి ఈ రెండు కళ్లు కూడా సరిపోవు. ఇప్పటికే వారి ఇంట ఎన్నో కార్యక్రమాలు జరిగాయి.. అవన్నీ కూడా ఓ రేంజ్‌లో నిర్వహించారు. ఇప్పుడు చిన్న కుమారుడి వివాహం వచ్చింది. నిశ్చితార్థమే అత్యంత గ్రాండ్‌గా చేశారు. తాజాగా మరోసారి చిన్న కుమారుడి ప్రీవెడ్డింగ్ జరగబోతుంది. పైగా అంబానీ ఇంట్లో చివరి పెళ్లి. ఇక చూడండి.. ఇంకెంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ప్రపంచంలో ఉన్న అతిరథ మహారథులంతా ఇండియాకు రాబోతున్నారు. ఇంతకీ ప్రీవెడ్డింగ్ ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తున్నారు. వచ్చే ఆ విదేశీ అతిథులెవరో తెలియాలంటే ఈ వార్త చదవండి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ను (Anant Ambani-Radhika Merchant) వివాహమాడనున్నారు. 2022 డిసెంబర్‌లోనే వీరిద్దరికి నిశ్చితార్థం జరగ్గా.. ఈ ఏడాది జులైలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే మ్యారేజ్ కంటే ముందు గుజరాత్‌లో ప్రీవెడ్డింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు గుజరాత్ జామ్‌నగర్ అతిపెద్ద ఈవెంట్‌కు వేదిక కాబోతుంది. దీనికి ప్రపంచ దేశాలకు చెందిన అపర కుబేరులు, వివిధ కంపెనీల సీఈవోలు, పలు దేశాల రాజకీయ ప్రముఖుల రానుండటంతో మరోసారి భారత్‌లో సందడి వాతావరణం నెలకోబోతుంది.
వచ్చే నెలలో 1-3 తేదీల మధ్య జామ్‌నగర్‌లోని రిలయన్స్ కాంప్లెక్స్‌లో అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Zuckerberg), మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates), అడోబ్ సీఈవో శంతను నారాయణ్ హాజరుకానున్నారు.
వీరితో పాటు బ్లాక్‌రాక్ సీఈవో ల్యారీ పింక్, బ్లాక్‌స్టోన్ ఛైర్మన్ స్టీఫెన్ స్క్వార్జ్‌మ్యాన్, డిస్నీ సీఈవో బాబ్ ఐగర్, డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్‌థాని విచ్చేయనున్నారు. మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బెర్క్‌షైర్ హాథ్‌వే వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు.. కెనడా, స్వీడన్, ఆస్ట్రేలియా, బొలీవియా దేశాల మాజీ ప్రధానులు, భూటాన్ రాజు, రాణి తదితరులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ జర్నలిస్టులు.. మీడియా ప్రముఖులు వగేరా విశిష్ట అతిథులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇందుకోసం గుజరాత్‌లో అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.