నల్లగొండ జిల్లా మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ తెలంగాణలో మతపరమైన ఉద్వేషాలు రెచ్చగొడుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది బీజేపీ అని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంతా మాటలకే పరిమితమైందని, రైతుల పండించిన పంట కొనలేని దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రతి ఒక్కరిపైన ఐదు లక్షల అప్పు మిగిలిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.