Ram Mandir: అయోధ్యలో 500 వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం నేడు ఆవిష్కృతమైంది. అయోధ్య నగరంలో రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. ఈ రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం రామనామ స్మరణతో ఉప్పొంగిపోయింది.
ఇక, మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రారంభమైన ప్రాణప్రతిష్ఠ క్రతువు.. ప్రధాని మోడీ బాలరాముడి పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదకలు సమర్పించారు. రామ్‌లల్లా విగ్రహం దగ్గర పూజలు చేశారు. 12: 29: 03 నుంచి 12: 30: 35 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కొనసాగింది. గణేశ్వర శాస్త్రీ ద్రావిడ నేతృత్వంలో క్రతువు జరిగింది. అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతీయుల హృదయాలు పులకరించిపోయారు. ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో బంగారు ఆభరణాలు ధరించి చిరు దరహాసం, ప్రసన్నవదనంతో బాలరాముడు దర్శనం ఇచ్చారు. అయితే, ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆకాశ వీధుల్లో నుంచి రామ మందిరంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ క్రతువుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పాల్గొన్నారు.