ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్ వేదికగా మొదటి టెస్టు జరగనుంది. వ్యక్తిగత కారణాలతో మొదటి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదు. దాంతో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో సిరీస్ మొత్తానికి బుమ్రానే కెప్టెన్‌గా కొనసాగించాలని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించారు. సన్నీ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించారు. భారత అభిమానులు తమ అభిప్రాయాలను మార్చుకుంటారన్నారు.
హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ షోలో జతిన్ సప్రూతో మాట్లాడుతూ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25పై స్పందించాడు. ‘ఆస్ట్రేలియాపై తొలి రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధిస్తే.. జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్‌గా కొనసాగించమని అభిమానులు కోరుకుంటారు. ఒకవేళ రెండు మ్యాచుల్లో ఓడితే.. రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాలని అంటారు. మనం చాలా వేగంగా మారిపోతుంటాం. సునీల్ గవాస్కర్‌ను టార్గెట్ చేసి చెప్పడం లేదు. ఇదంతా జనరల్ పబ్లిక్ టాక్. గవాస్కర్ చెప్పినట్లుగా సిరీస్ మొత్తానికి ఒకరే కెప్టెన్‌గా ఉండటం మంచి విషయం. ఒకవేళ భారత్ సిరీస్ ఓడినా ఎవరూ ప్రశ్నించరు’ అని భజ్జీ అన్నారు.
Also Read: IPL 2025 Auction: శ్రేయస్ అయ్యర్‌పై ఆ రెండు టీమ్స్ కన్నేసాయి.. గవాస్కర్ బోల్డ్ ప్రిడిక్షన్!
‘రోహిత్ శర్మ తిరిగొచ్చాక జట్టు ఓడిందంటే.. మరో చర్చకు దారితీసే అవకాశం లేకపోలేదు. బుమ్రా మొదటి టెస్టుకు సారథ్యం వహించి.. రోహిత్ రెండో టెస్టుకు కెప్టెన్. రోహిత్, బుమ్రా నాయకత్వంలో చెరొక టెస్టు ఓడిన తర్వాత.. చాలామంది అభిమానులు విరాట్ కోహ్లీకి షిఫ్ట్ అయిపోతారు. కోహ్లీకి సారథ్యం అప్పగించడంటూ డిమాండ్స్ చేస్తారు. గవాస్కర్ చేసిన సూచన బాగుంది. భారత జట్టును నడిపించగల సత్తా బుమ్రాకు ఉంది. బీసీసీఐ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే నేను చెప్పగలను. అంతా బీసీసీఐ ఇష్టం’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.