Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ల హత్య జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరిని చంపేందుకు హంతకులు ఒకరోజు ముందే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విచారణ కోసం ప్రయాగ్‌రాజ్ కోర్టుకు ఇద్దరినీ తీసుకెళ్లిన రోజునే షూటర్లు అతిఖ్, అష్రఫ్‌లను హత్య చేసేందుకు ప్రయత్నించారని సమాచారం. అయితే, కోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ముగ్గురూ ప్లాన్‌ను విరమించుకోవాల్సి వచ్చింది.
హంతకుల్లో ఒకరైన సన్నీ సింగ్‌కు 2021లో ఒక గ్యాంగ్‌స్టర్ టర్కీలో తయారు చేసిన తుపాకీని అందించాడు. అదే సంవత్సరం డిసెంబర్‌లో గ్యాంగ్‌స్టర్ మరణించాడని సన్నీ చెప్పాడు. పోలీసు వర్గాల ప్రకారం.. షూటర్లందరినీ ప్రశ్నించిన తర్వాత, విచారణ చేస్తున్న అధికారులు వారి వాంగ్మూలాల ప్రామాణికతను నిర్ధారించడానికి వారి నార్కో పరీక్షను నిర్వహించవచ్చు. ఏప్రిల్ 15న అతిఖ్ అహ్మద్‌ను హత్య చేసిన వారిని షూటర్లు అయిన అరుణ్ మౌర్య, సన్నీ సింగ్, లవ్లేష్ తివారీలుగా గుర్తించారు.
Read Also: Father Kills Son: మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు.. కన్న కొడుకునే కడతేర్చాడు!
వారిద్దరిని హత్య చేసేందుకు దుండగులు జిగానా పిస్టల్స్ (టర్కిష్ సంస్థ ఉత్పత్తి చేసిన సెమీ ఆటోమేటిక్ పిస్టల్)ను ఉపయోగించారు. పోలీసు బృందం సమక్షంలోనే షూటర్లు కేవలం 22 సెకన్లలో డజను రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. అతిక్, అష్రఫ్‌లను కాల్చి చంపిన తర్వాత, ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. దుండగులు వీడియో కెమెరాలు, మైక్, మీడియా ఐడెంటిటీ కార్డులను తీసుకుని జర్నలిస్టులుగా నటిస్తున్నారని యూపీ పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, అతిక్ అహ్మద్, అష్రఫ్ మీడియాతో మాట్లాడటం ప్రారంభించిన క్షణంలో, షూటర్లలో ఒకరు తన మైక్, కెమెరాను పడవేసి తన పిస్టల్ తీసుకొని వారిపై కాల్పులు జరిపాడు.