Assam Congress Chief: “మహాభారతంలో కూడా లవ్ జిహాద్ జరిగింది” అని సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఆయన సాధారణ ప్రజలను క్షమాపణ అడగడానికి వైష్ణవ్ ప్రార్థనకు సంబంధించిన ఓ గీతాన్ని కూడా పాడాడు. గోలాఘాట్‌లో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు ‘లవ్ జిహాద్’ అని అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంపై బోరా స్పందిస్తూ.. శ్రీకృష్ణుడికి రుక్మిణితో ఉన్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ, “ప్రేమ మరియు యుద్ధంలో అన్నీ న్యాయమే” అని అన్నారు.
Also Read: Opposition Meet: ఆగస్ట్ 15 తర్వాతే ముంబయిలో ప్రతిపక్ష కూటమి మూడో సమావేశం!
శ్రీకృష్ణుడు రుక్మిణిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అర్జునుడు స్త్రీ వేషంలో వచ్చాడు. “మహాభారతంలో కూడా లవ్ జిహాద్ ఉంది” అని బోరా చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద రాజకీయ దుమారానికి దారితీశాయి. పోలీసు కేసు పెడితే కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు. “శ్రీకృష్ణుడు, రుక్మిణి అంశాన్ని లాగడం ఖండించదగినది. ఇది సనాతన ధర్మానికి విరుద్ధం. హజ్రత్ ముహమ్మద్ లేదా ఏసుక్రీస్తును ఎలాంటి వివాదంలోకి లాగకూడదో, అదే విధంగా శ్రీకృష్ణుడిని ఎలాంటి వివాదంలోకి లాగకుండా ఉండాలని నేను కాంగ్రెస్‌ను అభ్యర్థిస్తున్నాను. దేవుడిని క్రిమినల్ యాక్టివిటీతో పోల్చడం ఆమోదయోగ్యం కాదు’ అని హిమంత ముందే చెప్పారు.
Also Read: West Bengal: ప్రేమ విషయంలో గొడవ.. ప్రియుడి పెదాలు కోసిన ప్రియురాలి పేరెంట్స్
కాంగ్రెస్ చీఫ్ శుక్రవారం మాట్లాడుతూ.. తన తాత నిన్న రాత్రి తన కలలోకి వచ్చారని, వచ్చి ప్రకటన తప్పు అని, ఇది రాష్ట్ర ప్రజలను బాధపెట్టింది అని చెప్పారన్నారు.తన పార్టీకి నష్టం జరగకూడదని తాను కోరుకోవడం లేదని బోరా అన్నారు. తన మాటలు వైష్ణవ భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కూడా ఇష్టం లేదని పేర్కొన్నారు. అందుకే వైష్ణవ ఆలయంలో మట్టి దీపం, తమలపాకులు సమర్పించాలని నిర్ణయించుకున్నాన్నారు. స్వామిని క్షమించమని ప్రార్థించాలని నిర్ణయించుకున్నానన్నారు. ముఖ్యమంత్రికి భయపడి తాను ఇలా చేయడం లేదన్నారు.
మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిపై పలు కేసులు నమోదయ్యాయి. బోరా హిందువుల మనోభావాలను దెబ్బతీశాడని పేర్కొంటూ భారతీయ జనతా యువమోర్చా (బివైజెఎం) గౌహతి నగర అధ్యక్షుడు, బీజేపీ యువజన విభాగం నిహార్ రంజన్ శర్మ పాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వారం ప్రారంభంలో, గోలాఘాట్ జిల్లాలో ఒక యువకుడు కొన్ని కుటుంబ సమస్యలపై తన భార్య, ఆమె తల్లిదండ్రులను హత్య చేసి, తరువాత పోలీసుల ముందు లొంగిపోయాడు. భర్త ముస్లిం, భార్య హిందువు కావడంతో దీనిని ‘లవ్ జిహాద్’గా బీజేపీ పేర్కొంటోంది.