ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పడంతోనే తాము ఆసియా కప్ 2025 నుంచి వైదొలగలేదు అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వి వెల్లడించారు. పీఎం సహా చాలా మంది మద్దతు తమకు ఉందని, ఆసియా కప్‌ను బహిష్కరించాలనుకుంటే పెద్ద నిర్ణయమే అవుతుందన్నారు. తాము సమస్యను పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాం అని చెప్పారు. క్రీడలు, రాజకీయాలు ఎప్పటికీ ఒకటి కాదని తాము నమ్ముతున్నాం నఖ్వి తెలిపారు. నిజానికి టోర్నీ నుంచి వైదొలిగితే ఆర్థికంగా పీసీబీ పెద్ద దెబ్బ. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న పీసీబీకి.. వచ్చే కాస్తంత ఆదాయం కూడా రాకుండా పోతుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే టోర్నీలో కొనసాగుతోంది. పైకి మాత్రం రిఫరీ సాకు చూపి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది.
ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్‌లో సెప్టెంబర్ 14 భారత్, పాకిస్థాన్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ఆటగాళ్లతో భారత్ క్రికెటర్లు కరచాలనం చేయలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిబంధనలు ఉల్లంఘించాడని, టోర్నీ నుంచి అతడిని వెంటనే తొలగించాలని ఆసియా క్రికెట్ సంఘం (ఏసీసీ)కి పీసీబీ ఫిర్యాదు చేసింది. ఒకేవేళ మ్యాచ్ రిఫరీని తొలగించకుంటే తాము టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. దీనిపై ఐసీసీని ఏసీసీ సాయం కోరింది. రిఫరీని తొలగించాలన్న పీసీబీ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. టోర్నీని బహిష్కరిస్తామన్న పీసీబీ.. బుధవారం యూఏఈతో ఆడింది. టోర్నీలో కొనసాగడంపై పీసీబీ చీఫ్, ఏసీసీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వి స్పందించాడు.
Also Read: Telangana Rains: రానున్న 3 గంటల్లో భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక!
యూఏఈ, పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం మోసిన్ నఖ్వి మాట్లాడుతూ… ‘టోర్నీలో సెప్టెంబర్ 14 నుంచి పరిస్థితులు మారాయి. భారత్, పాక్ మ్యాచ్ రిఫరీ పాత్రపై మేం ఫిర్యాదు చేశాం. యూఏఈతో మ్యాచ్‌కు కాసేపటి ముందు రిఫరీ పాక్ టీమ్ కోచ్, కెప్టెన్, మేనేజర్‌తో మాట్లాడారు. క్షమాపణలు చెప్పాడు. కరచాలనం ఘటన జరిగి ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డాడు. క్రీడలు, రాజకీయాలు ఎప్పటికీ ఒకటి కాదని మేం నమ్ముతున్నాం. ఇది ఓ ఆట మాత్రమే. ఒకవేళ మేం ఆసియా కప్‌ను బహిష్కరించాలని అనుకుంటే.. పెద్ద నిర్ణయమే అవుతుంది. పీఎంతో పాటు ప్రభుత్వ అధికారులు, చాలా మంది మద్దతు మాకు ఉంది. అయినా కూడా మేం ఏ నిర్ణయం తీసుకోలేదు. మేం సమస్యను పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాం. ఇలాంటి ఘటన మారాలా రిపీట్ కాదని భావిస్తున్నాము’ అని చెప్పారు.