AP Minister Vidadala Rajini React on Attck on Guntur Party Office: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఖండించారు. టీడీపీ గుండాలే ఈ దాడి చేశారని, దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడని, రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారన్నారు. బీసీ మహిళనైన తనపై కుట్రలు చేస్తున్నారని, ఇలాంటి దాడులతో ఏమాత్రం భయపెట్టలేరని మంత్రి విడదల రజిని తెలిపారు. విద్యానగర్‌లోని మంత్రి నూతన పార్టీ ఆఫీస్‌పై టీడీపీ-జనసేన కార్యకర్తలు అర్ధరాత్రి రాళ్ల దాడి చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసు దగ్గరి ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు.
మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు. అనంతరం మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ… ‘టీడీపీ గుండాలు ఈ దాడి చేశారు. ప్రీ ప్లాన్డ్ గా ఈ దాడి చేశారు. దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదు. బీసీ మహిళనైన నాపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఇలాంటి పార్టీలు అధికారంలోకి వస్తే ఏం జరగబోతుందో ప్రజలు ఆలోచించాలి. మాకు ప్రజల మద్దతు ఉంది. వైసీపీ శ్రేణులు సహకారంతో ఇలాంటి దాడులు ఎలా ఎదుర్కోవాలో, ఎలా బుద్ది చెప్పాలో మాకు తెలుసు’ అని అన్నారు.
Also Read: Top Headlines @ 9AM: టాప్ న్యూస్!
‘నారా చంద్రబాబుకు, లోకేష్ బాబుకు బీసీలపై కపట ప్రేమే ఉంది. ఒక బీసీ మహిళా కార్యాలయంపై దాడి చేపించారు. టీడీపీకి బీసీలు అంటే గౌరవం లేదు. ఈ దాడికి వందల మంది పాల్పడ్డారు. పక్కా ప్రణాళికతో దాడి చేశారు. లాఠీఛార్జ్ చేసినప్పటికి దాడి కొనసాగించారు. ఇప్పటికే ముప్పై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి సూత్రదారులు, పాత్రధారులు ఎవరున్నా వదిలేది లేదు’ అని మంత్రి విడదల రజిని వార్నింగ్ ఇచ్చారు.