AP Governor Tour: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రేపు(నవంబర్ 15) అరకులోయలో పర్యటించనున్నారు. జన జాతీయ గౌరవ దివస్, వీక్షిత్ భారత్ సంకల్ప యాత్రలను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించనున్నారు. అరకులోయ మండలం రవ్వలగూడ గ్రామంలో గవర్నర్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్. అరకులోయ చేరుకోనున్నారు. అనంతరం పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. తిరిగి మధ్యాహ్నం విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు.
Also Read: Tourism Workers Strike: టూరిజం కార్మికుల సమ్మె విరమణ
గవర్నర్ అరకు పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పీవో వి.అభిషేక్ మాట్లాడుతూ ఈ నెల 15న జార్ఖండ్‌లో జనజాతీయ గౌవర్ దివాస్, వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని, ఆ కార్యక్రమాన్ని ఇక్కడ గవర్నర్ ప్రారంభించనున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించేందుకు మూడు వాహనాలతో జిల్లాలో ప్రచారం నిర్వహిస్తారని, ఆ వాహనాలను గవర్నర్ అరకులోయలో జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. గవర్నర్ వేదిక వద్దకు చేరుకోగానే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై కార్నివాల్ నిర్వహిస్తామన్నారు. ఆ తరువాత గవర్నర్ మొక్కలు నాటడంతో పాటు, వివిధ స్టాళ్లను ప్రారంభిస్తారన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీవో ఆదేశించారు.